ఆలేరు టౌన్, మే 30 : చేనేత కార్మికుల బతుకులను కండ్లకు కట్టినట్లుగా తెరకెక్కిన చిత్రం మల్లేశం. ఈ మూవీ 2019 గద్దర్ అవార్డుల విజేతల్లో మూడవ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. దీనిపై పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. మల్లేశం సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాతగా వ్యవహరించిన రాజు రాచకొండకు, నటీ, నటులు ప్రియదర్శి, అనన్య, సినిమా నిర్మాణంలో పనిచేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
తన తల్లి ఆసు పోయడానికి పడుతున్న బాధను చూసి చెల్లించిపోయిన చింతకింది మల్లేశం ఏడు సంవత్సరాలు కష్టపడి ఆసు యంత్రాన్ని తయారు చేశారు. తన కృషికి గాను అబ్దుల్ కలాం అవార్డు, పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఎన్నో ఇన్నోవేషన్స్ లో పాల్గొని చేనేత రంగానికి సులభమైన పద్ధతిలో యంత్రాన్ని తయారుచేసి చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తం మల్లేశం.