యాదాద్రి, మార్చి29: యాదాద్రి నూతన ఆలయంలో స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రెండోరోజు వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ప్రధానాలయ కట్టడాలు, క్యూలైన్లు, వసతులను చూసి అబ్బురపడ్డారు. ఆరేండ్ల తర్వాత నూతన ఆలయంలో స్వామివారి వైభవాన్ని చూసి తన్మయత్వం చెందారు. క్యూలైన్లు, మెట్ల అమరిక, ప్రసాద విక్రయశాల భవనం మహాద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. కొండకింది లక్ష్మీపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారి దర్శనానికి కొండపైకి వెళ్తున్నారు. క్యూకాంఫ్లెక్స్ మొదటి అంతస్తులోనే టికెట్ల విక్రయశాల, క్లాక్‌రూం, సీసీ టీవీ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేశారు. ప్రతి భక్తుడిని మెటల్ డిటెక్టర్ ద్వారా తనిఖీ చేస్తున్నారు. క్యూలైన్ల గుండా తూర్పు ద్వారం, తిత్రల రాజగోపురం నుంచి నేరుగా ప్రధానాలయంలోకి వెళ్లి భక్తులు స్వయంభువుల దర్శనం చేసుకొంటున్నారు. మంగళవారం ఒక్కరోజే ప్రసాద విక్రయాలతో స్వామివారికి రూ.8.17 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు.