భూదాన్ పోచంపల్లి, మే 29 : భూదాన్ పోచంపల్లి మండలంలోని దంతూరు గ్రామం బూరుగుగుంట పరిధిలో ఉన్న ఏడు ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమిని కొంతమంది కబ్జా చేస్తున్నారని, వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పోచంపల్లి పట్టణ నాయకుడు పగడాల శివ డిమాండ్ చేశారు. గురువారం దంతూరు గ్రామంలోని బూరుకుంట భూమిని ఆయన పరిశీలించి మాట్లాడారు. బూరుగుకుంట కట్ట తెగి గండిపడేలా చేశారని, అనంతరం కుంటను పూడ్చి దాదాపు 7 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమిని శివారెడ్డిగూడెం గ్రామానికి చెందిన రైతు పేరుతో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసినట్లు తెలిపారు.
అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో చెరువుల్లో కబ్జా ఉన్న భవంతులను కూల్చివేస్తూ, మూసి ప్రక్షాళనతో చెరువులను కాపాడుతామని ప్రకటన చేస్తుంటే, కొంతమంది మాత్రం ప్రభుత్వ భూమిని ఆక్రమించి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోతగల నరసింహ, గోరుగంటి ముత్యాలు, పాక లింగస్వామి, సతీశ్ పాల్గొన్నారు.