Alair | ఆలేరు టౌన్, జూన్ 15 : శాంతియుత వాతావరణంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న యాదగిరిగుట్ట మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు కర్రె వెంకటయ్యను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఆలేరు మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకరయ్య ఆరోపించారు. ఆలేరు పట్టణ కేంద్రంలోని ఆయన నివాసం వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా మల్లాపురం గ్రామంలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేస్తే.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి దాతర్పల్లి గ్రామంలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.
మల్లాపురం గ్రామంలో శిలాఫలకం వేసి శంకుస్థాపన చేసిన కాలేజీని, దాతర్‌పల్లిలో మళ్లీ సీఎం రేవంత్ రెడ్డి శిలాఫలకం వేసి శంకుస్థాపన చేయడం సమంజసమేనా? అంటూ ప్రశ్నించారు. రూ.1500 కోట్లు నిధులు తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. గత బీఆర్ ఎస్ ప్రభుత్వంలో మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి తెచ్చిన నిధులు తప్ప, కొత్తగా యాదగిరిగుట్టకు నిధులు తెచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది శూన్యమని విమర్శించారు. ఎక్కడైతే శిలాఫలకం వేశారో.. అక్కడే మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టాలని ఆమరణ నిరాహారదీక్ష చేస్తుంటే పోలీసులు ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కర్రె వెంకటయ్యకు పోలీసులు ఏ హాని తల పట్టిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఐలయ్యకు దమ్ము ధైర్యం ఉంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపించాలని ఆయన సవాల్ విసిరారు.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని ఆయన గుర్తు చేశారు. గతంలో ఆలేరు అభివృద్ధి కోసం రూ.20కోట్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ప్రభుత్వ విప్, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కేటాయిస్తే, ఆ నిధులను విడుదల చేసి ఆలేరును అభివృద్ధి చేయకుండా ఆలేరు అభివృద్ధి నిరోధకులుగా ఐలయ్య మారారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి కేసులు పెడితే భయపడే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, బీఆర్ఎస్ నాయకులు పత్తి వెంకటేశ్, పంతం కృష్ణ, జింకల రామకృష్ణ, దయ్యాల సంపత్, చిమ్మి శివమల్లు, సంతోష్ రెడ్డి, ఎండీ గోరేమియా, ఎండీ జమాల్, ఎండీ ఫయాజ్, కటకం బాలరాజు, బాసాని ప్రశాంత్, చింతపండు సుదర్శన్, బన్నీ, టింకు పాల్గొన్నారు.