భూదాన్ పోచంపల్లి, మే 02 : భూదానోద్యమానికి నాంది పలికి, చేనేతకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన భూదాన్ పోచంపల్లిలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ (ఐఐహెచ్టీఐ) ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో పోచంపల్లి ఇక్కత్ పరిశ్రమపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించింది చేనేత పరిశ్రమని, రైతన్నలతో పాటు నేతన్నలను కూడా ఈ ప్రభుత్వం గుర్తించిందని, చేనేత కార్మికులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు .లక్ష రూపాయల రుణాలను మాఫీ చేసిందన్నారు. హ్యాండ్లూమ్ పార్కును మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందన్నారు. భూదాన్ పోచంపల్లి మండలంలో రైతు భరోసా స్కీమ్ లో టెక్నికల్ సమస్యలతో రైతులకు అందలేదని, త్వరలోనే భరోసా నిధులను విడుదల చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర చేనేత నాయకుడు తడక వెంకటేశ్, టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షుడు భారత లవ కుమార్, పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ తడక రమేశ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పాక మల్లేశ్ యాదవ్, రాష్ట్ర నాయకుడు మురళి, జిల్లా నాయకులు గర్దాసు బాలయ్య, కళ్లెం రాఘవరెడ్డి, సామ మధుసూదన్ రెడ్డి, మర్రి నర్సింహారెడ్డి, కొట్టం కరుణాకర్ రెడ్డి, సామ మోహన్ రెడ్డి, గుణిగంటి వెంకటేశ్, నాయకులు, చేనేత కార్మికులు, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Pochampally : పోచంపల్లిలో ఐఐహెచ్టీఐ ఏర్పాటుకు కృషి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు