సంస్థాన్ నారాయణపురం, జూన్ 17 : సంస్థాన్ నారాయణపురం మండలం మల్లారెడ్డిగూడెం గ్రామంలోని రైతుల పొలాల్లో నుండి వెళ్లిన విద్యుత్ తీగలు ప్రమాదభరితంగా ఉన్నాయి. చేతికి అందే ఎత్తులో కరెంట్ తీగలు వేలాడుతున్నా విద్యుత్ శాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. విద్యుత్ స్తంభాల మధ్య దూరం ఎక్కువగా ఉండడంతో వైర్లు చేతికి అంది ఎత్తులో వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయి. పొలంలో పని చేసేటప్పుడు ఏమరపాటుగా ఉంటే ఇక అంతే సంగతులు అంటున్నారు. గాలులు వీచినప్పుడు వైర్లు ఒకదానికి ఒకటి తగులుకుని షార్ట్ సర్క్యూట్ అవుతుండడంతో రైతులు భయాందోళన గురవుతున్నారు.
పొలాల్లో వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని, అవసరమైన చోట కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని గత రెండు సంవత్సరాలుగా అధికారులు చుట్టూ తిరుగుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే వ్యవసాయం పొలంలో ఉన్న బర్రెకు విద్యుత్ తీగలు తగిలడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేసి సమస్యను పరిష్కరించాలని మల్లారెడ్డిగూడెం గ్రామ రైతులు కోరుతున్నారు.