ఆత్మకూరు(ఎం), మే 28 : దాహం తీర్చుకునేందుకు బోరు నీళ్లు తాగిన బాలుడిని ఓ కానిస్టేబుల్ చితకబాదాడు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) లో జరిగిన ఈ అమానుష సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రానికి చెందిన మజ్జిగ ప్రవీణ్ ఈ నెల 26న తమ వ్యవసాయ బావి వద్ద తల్లి విజయ గొర్రెలు మేపుతుండగా భోజనం తీసుకువెళ్లాడు. వీరి వ్యవసాయ బావి పక్కనే ఉన్న 18 ఎకరాల వ్యవసాయ భూమిని ఆత్మకూరు(ఎం) పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న లింగంనాయక్ కౌలుకు చేస్తున్నాడు. ప్రవీణ్‌కు దాహం వేయడంతో కానిస్టేబుల్ కౌలు చేస్తున్న భూమికి సంబంధించిన బోరు మోటర్‌ను ఆన్ చేసి బాటిల్లో నీళ్లు పట్టుకున్నాడు. అక్కడే మేత మేస్తున్న గొర్రెలు కూడా నీళ్లు తాగేందుకు బీడు పొలంలోకి వచ్చాయి.
దీంతో ఆగ్రహించిన కానిస్టేబుల్ లింగంనాయక్ బోర్ ఆన్ చేసి నీళ్లు పట్టుకుంటావా అంటూ ప్రవీణ్‌ను కర్రతో చితక బాదినట్లు, అడ్డుకునేందుకు ప్రయత్నించిన తనపై కూడా దాడి చేసినట్లు తల్లి విజయ తెలిపింది. దాడి జరిగిన రోజే లింగంనాయక్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపించారు. బుధవారం విలేకరుల సమావేశంలో కుర్మ సంఘం నాయకులు మాట్లాడుతూ బాలుడిని అకారణంగా చితకబాదిన కానిస్టేబుల్ లింగంనాయక్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.