సంస్థాన్ నారాయణపురం, మార్చి 22 : ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను అమలు చేయడం చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని బీజెపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచుతారా అని ప్రశ్నించారు.
నారాయణపురం మండలంలో భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లలో చుక్కనీరు లేకపోవడంతో వరి పంటలు పూర్తిగా ఎండిపోయినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.30 వేల నష్టపరిహారం అందజేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. శివన్నగూడెం ప్రాజెక్టు త్వరగా పూర్తిచేసి ఇబ్రహీంపట్నం చెరువుని రిజర్వాయర్‌గా చేసి ఆ నీటితో మండలంలోని చెరువులను నింపాలని, లేని పక్షంలో మూసీ జలాలను శుద్ధిచేసి సాగునీరు అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సుర్విరాజు గౌడ్, నాయకులు బచ్చనగోని దేవేందర్, దూడల భిక్షం, భాస్కర్ నరసింహ, జక్కర్తి బిక్షం, సుధాకర్ రెడ్డి, బండ మీది కిరణ్, ఎలిజాల శ్రీను పాల్గొన్నారు.