యాదాద్రి, డిసెంబర్ 21 :వరికి బదులు ఇతర పంటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్న తరుణంలో రైతులు ఆరుతడి పంటల సాగుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయ అధికారుల సలహాల మేరకు తక్కువ నీటి వినియోగం, ఎక్కువ దిగుబడి, ఆదాయాన్నిచ్చే పంటలను ఎంచుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో చాలా మంది ఆసక్తి చూపుతున్నా పక్షులు, జంతుజాలంతో భయపడుతున్నారు. వన్య ప్రాణుల బారి నుంచి పంటను ఎలా రక్షించుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పంటలు ఎలా రక్షించుకోవాలో యాదాద్రి భువనగిరి జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త మధుశేఖర్ వెల్లడించారు. వేరుశనగ, జొన్న సహా పలు పంటలను చీడ, పీడలతో పాటు అడవి జంతువులు, పక్షుల బారి నుంచి కాపాడుకునే మార్గాలను వివరించారు.
యాసంగిలో వేరుశనగ, శనగ, మొక్కజొన్న, జొన్న, పొద్దు తిరుగుడు తదితర ఆరుతడి పంటలు సాగు చేసుకోవచ్చు. సాగు నీరు, పెట్టుబడి కూడా తక్కువే. పంటమార్పిడి పద్ధతి వల్ల భూసారం కూడా పెరుగుతుంది. రైతులు సామూహికంగా వ్యవసాయం చేసుకుంటే జంతువుల బెడద తక్కువగా ఉంటుంది.
జీవ ఆర్తనాద యంత్రం…
జంతువులు, పక్షుల బారి నుంచి పంటలు కాపాడుకోవడంలో జీవ ఆర్తనాద యంత్రాలు సమర్థంగా పనిచేస్తున్నాయి. ఎకరం నుంచి 20 ఎకరాల దూరం వరకు వివిధ రకాల శబ్దాలను చేసే జీవ ఆర్తనాద యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఒక యంత్రంలో దాదాపు 400 రకాల జంతువుల శబ్దాలు ఉంటాయి. జంతువులు పట్టుబడ్డ, ప్రమాద సమయంలో వచ్చే జంతువుల అరుపులు యంత్రాల్లో నిక్షిప్తం చేశారు. సుమారు అరగంటపాటు శబ్దాలు వినిపిస్తాయి. వీటి ధర రూ.5 నుంచి 10వేల వరకు ఉంటుంది. బ్యాటరీ ద్వారా, సోలార్ ద్వారా కూడా యంత్రాలు పనిచేస్తాయి. సుమారు ఎకరం నుంచి పదె ఎకరాల్లో సోలార్ ఫెన్సింగ్ వేసుకోవాలి. సోలార్ ఫెన్సింగ్ షాక్ కొడుతుంది తప్ప ప్రమాదకరమేమీ కాదు. ఇలాంటి పద్ధతుల ద్వారా అడవిపందులు, కోతులు, నెమళ్ల నుంచి పంటలను కాపాడుకోవచ్చు. రామన్నపేట మండలంలోని శోభనాద్రిపురంలో రవి అనే రైతు జీవ ఆర్తనాద యంత్రాన్ని ఉపయోగిస్తున్నాడు.
కోతుల కట్టడికి..
కోతులకు ఇష్టంలేని.. జిగురు, ముళ్లతో కూడుకున్న కాకర, వంకాయ, ముళ్లున్న బెండ, కందగడ్డ, చామగడ్డ లాంటివి పంటల ముందు వరుసలో వేసుకోవాలి. సుమారు 6-8 అడుగుల ఎత్తు, 3 అంగుళాల గడులున్న నైలాన్ వలను కర్రల సాయంతో పొలం చుట్టూ కంచెలా ఏర్పాటు చేసుకోవాలి. ఎకరానికి రూ.6వేల నుంచి రూ.8 వేల ఖర్చు వస్తుంది. సోలార్ కంచె అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది. 5 నుంచి 8 ఎకరాల్లో ఏర్పాటు చేసుకుంటే రూ.20 వేల ఖర్చవుతుంది. కోతులను పటాకుల శబ్దంతో కూడా బెదరగొట్టొచ్చు. సామూహికంగా వచ్చిన కోతులను మంకీగన్తో అడ్డుకోవచ్చు. అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా తయారు చేసిన ఈ గన్ రూ.3,500 నుంచి 7వేల వరకు ధర ఉంటుంది. మంకీగన్ శబ్దంతో కోతులు భయపడి పారిపోతాయి.
అడవి పందుల నివారణకు..
ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన జీవ ఆర్తనాద యంత్రాన్ని ఉపయోగించి పంటలను కాపాడుకోవచ్చు. అడవి పందులు సాధారణంగా గుంపులుగాఉంటాయి. 8 నుంచి 10 వరకు సంచరిస్తూ ఉంటాయి. ఎకోడాన్ అనే మందును పంట చుట్టూ పిచికారీ చేస్తే ఘాటైన వాసనకు అవి దూరంగా ఉంటాయి. పొలం చుట్టూ చిన్న గుంత చేసుకుని సల్ఫర్‌ను వేసుకోవాలి. పందులు వచ్చే ప్రాంతాల్లో చిన్న కర్రలను నాటి, కర్రలకు వస్ర్తాన్ని చుట్టి సల్ఫర్ వేసి అప్పుడప్పుడు నీటితో తడుపాలి. ఆ వాసనకు పందులు దరిచేరవు. పొటాషియం కలిపి చల్లిన ఉల్లిగడ్డను తినే పందులు కడుపులో ఇబ్బంది ఏర్పడి ఆ ప్రాంతానికి రాకుండా ఉంటాయి. కత్తిరించిన వెంట్రుకలను పొలం చుట్టూ చల్లితే వాటిని తిన్న పందులకు కడుపులో తీవ్ర ఇబ్బంది ఏర్పడి, మరోసారి ఆ ప్రాంతాలకు రాకుండా ఉంటాయి. పంట చుట్టూ మొదటి మూడు, నాలుగు వరుసల్లో కుసుమ పంట వేసుకుంటే ఆ మొక్కలకు ఉన్న ముళ్లతో పందులు రాకుండా నివారించవచ్చు. వృత్తిరీత్యా వేటాడే వారితోనూ పందులను పట్టి కాల్చేయవచ్చు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అనుమతులను ఇచ్చింది.
కోతుల గుంపుపై సర్వే..
కోతుల వల్ల జరిగే పంట నష్టం అంచనాపై వ్యవసాయ శాఖ సమాయత్తమైంది. కోతుల గుర్తింపు, వాటి వల్ల పంటలకు కలుగుతున్న నష్టాన్ని లెక్కించాలని ఏఈఓలకు బాధ్యతను అప్పగించింది. కోతుల సంఖ్య, వాటి వల్ల ఏ రకం పంటలకు ఎంత నష్టం వాటిల్లుతుందో అంచనా వేయాల్సి ఉంటుంది. కోతులు రాత్రి ఎక్కడ ఉంటున్నాయి.. వాటికి ఆహారం ఏ రకంగా అందుతుందనే విషయాన్ని గుర్తించాలి. కోతులను అటవీ ప్రాంతాలకు తరలించే అవకాశం ఏమైనా ఉందా? అని పరిశీలించాలి. వీటితో పాటుగా అడవి పందులు, ఇతర అడవి జంతువుల సమూహాల సంఖ్యను కూడా గుర్తించాల్సి ఉంది. కోతులు, అడవిపందుల వల్ల ఎంతమేర నష్టం జరుగుతుందో నమోదు చేయాల్సి ఉంటుంది. ఏఈఓలు రైతులను కలిసి ఆయా వివరాలను ఆన్లైన్ క్రాప్ బుకింగ్ మాడ్యూల్ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. పంటల సర్వేతో పాటు కోతుల సంఖ్యను లెక్కించాలని ప్రభుత్వం ఆదేశించిందని ఆలేరు ఏడీఏ వెంకటేశ్వర్లు తెలిపారు.
పక్షుల నుంచి రక్షణ ఇలా..
పొద్దు తిరుగుడు, మొక్కజొన్న, జొన్నలో పక్షుల బెడద ఎక్కువ. రిబ్బన్ పద్ధతి ద్వారా వాటిని అడ్డుకోవచ్చు. ఆకుచుట్టు విధానం, వేప నూనె పిచికారీ ద్వారా పక్షులు గింజలు తినడానికి విముఖత చూపుతాయి.
ఎలుకల నివారణకు..
కలుగుల్లో ఎలుకలను బ్రోమో స్మోకర్, ర్యాట్ గన్ అనే పరికరాన్ని ఉపయోగించి పొగబారించి నివారించవచ్చు. జింక్ పాస్పైడ్, బ్రోమోడయలిన్ను వాడి నివారించొవచ్చు. జింక్ పాస్పైడ్ను ఎలుకలు మరీ ఎక్కువగా ఉంటేనే వాడాలి. దాంతోపాటు 80 గ్రాముల నూకలు, నువ్వులు, బెల్లం కలిపి తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని 20 గ్రాముల పొట్లాలుగా కన్నానికి ఒకటి చొప్పున రెండు రోజులు పెట్టి ఎలుకలను మచ్చిక చేసుకోవాలి. మూడో రోజు 960 గ్రాముల నూకలు. 2 గ్రాముల జింక్ పాస్పైడ్ మందును కలిపి 10 గ్రాముల పొట్లాలుగా కట్టి కన్నంలో ఒక్కొక్కటి చొప్పున వేయాలి.