యాదగిరిగుట్ట, జూన్ 17 : కాంగ్రెస్ పార్టీ నాయకులు సిగ్గులేకుండా ప్రసంగాలు చేస్తున్నారని, ముందు వైద్య కళాశాల ఏర్పాటుపై స్పష్టతనివ్వాలని బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట పట్టణ సెక్రటరి జనరల్ పాపట్ల నరహరి అన్నారు. మంగళవారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. మల్లాపురం గ్రామంలోని సర్వే నంబర్ 64లో నిర్మించేందుకు రూ.183 కోట్లతో శ్రీలక్ష్మీనరసింహస్వామివారి పేరిట మంజూరైన 100 ఎంబీబీఎస్ సీట్ల సామర్థ్యంతో 300 పడకల ఆస్పత్రిని ఎక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టత ఇచ్చి వెంటనే పనులను ప్రారంభించాలన్నారు. వైద్య కళాశాల యాదగిరిగుట్ట మండలంలోనే నిర్మిస్తారా? లేక భువనగిరికి తరలిపోతుందా అన్న అనుమానాలు తావిస్తున్నాయన్నారు.
కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు కానుగు బాలరాజు, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, మాజీ కౌన్సిలర్ ముక్కర్ల మల్లేశ్, పట్టణ అధ్యక్షుడు బందారపు భిక్షపతి, ఎరుకల హేమేందర్ గౌడ్ మాట్లాడుతూ ”బీఆర్ఎస్ గుండాల్లారా” అని ఉచ్చరించడం సిగ్గు చేటన్నారు. అధికారంలో ఉంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు అడిగిన ప్రశ్నలకు సమాదానం చెప్పాలి గానీ, దాడికి దిగడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు యాదగిరిగుట్ట పట్టణంలో చేసిన అభివృద్ధి ఎంటో చెప్పాలన్నారు. గత ప్రభుత్వ హాయాంలో మంజూరైన పనులకు తిరిగి శంకుస్థాపన చేసి గొప్పలు చెప్పుకోవడం తప్పా చేసింది శూన్యమన్నారు.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయాల్సిందిపోయి, ప్రశ్నించిన వారిపై దాడికి పాల్పడడం సిగ్గుచేటన్నారు. రైతు భరోసా లేదు. వృద్దులకు రూ.4 వేల పింఛన్లు లేదు, మహిళలకు రూ.2,500 ఎక్కడకుపాయే, తులం బంగారం ఏమైంది, విద్యార్థినులకు స్కూటీలు ఏమాయే.. ఇలా ఇచ్చిన హామీలను మరించి ప్రచారానికే పరిమితమైతే తగిన సమయంలో ప్రజలు గట్టి బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాండవుల భాస్కర్ గౌడ్, ఆరే శ్రీధర్, గుండ్లపల్లి వెంకటేశ్ గౌడ్, వాసం రమేశ్ పాల్గొన్నారు.