భూదాన్ పోచంపల్లి, మార్చి 22 : యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెం గ్రామ శివారులోని పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. గ్రామంలో పిట్ట సుదర్శన్‌రెడ్డికి చెందిన పౌల్ట్రీ ఫామ్‌లో ఈ నెల 12న 500 కోళ్లు మృతి చెందాయి. పశు వైద్యాధికారికి సమాచారం ఇవ్వగా చనిపోయిన కోళ్ల శాంపిల్స్‌ను సేకరించి వెటర్నరీ బయోలాజికల్ రీసర్చ్ ఇనిస్ట్యూట్ కు పంపించారు. నమోనాలను పరీక్షించగా కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందని అధికారులు నిర్ధారించారు.
పశు సంవర్ధన శాఖ వైద్యాధికారి, జిల్లాలోని అధికారులు సిబ్బందితో 32 రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లుగా ఏర్పడి పీపీ కిట్లు ధరించి ఫారంలోని 40 వేల కోళ్లను గుంత తీసి పాతిపెట్టారు. శనివారం పౌల్ట్రీ ఫారంలో మిగిలిన 5 వేల కోళ్లను చంపి వేస్తున్నారు. ఇప్పటికే 19 వేల గుడ్లను, టన్నుల కొద్ది దానాను దగ్ధం చేశారు. కోళ్లను చంపి గోనే సంచిలో మూట కట్టి గొయ్యి తీసి పూడ్చి వేస్తున్నారు. కోళ్ల ఫారం నుండి ఒక కిలోమీటర్ వరకు పరిసర ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించారు.
కోళ్ల ఫారంను పూర్తిగా శానిటైజ్ చేస్తామని, పౌల్ట్రీ ఫామ్‌ను మూడు నెలల వరకు సీజ్ చేయనున్నట్లు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి జానయ్య తెలిపారు. జిల్లా పశు వైద్య అధికారులతో పాటు, ప్రాథమిక వైద్యాధికారి, వైద్య సిబ్బంది, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు పౌల్ట్రీ ఫామ్ దగ్గర ఉండి తగిన చర్యలు చేపడుతున్నారు. ధోతిగూడెంలో బర్డ్ ఫ్లూ కేసు నమోదు కావడంతో పరిసర గ్రామాల్లోని పౌల్ట్రీ ఫామ్ యజమానులు, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని జిల్లా పశు వైద్యాధికారి తెలిపారు.
Bird flu : ధోతిగూడెంలో బర్డ్ ఫ్లూ కేసు నమోదు.. రంగంలోకి జిల్లా యంత్రాంగం
Bird flu : ధోతిగూడెంలో బర్డ్ ఫ్లూ కేసు నమోదు.. రంగంలోకి జిల్లా యంత్రాంగం