యాదగిరిగుట్ట, నవంబర్27: గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య (Beerla Ilaiah)కు భారీ షాకిచ్చారు స్వగ్రామంలోని నాయకులు. ఆయన సొంతూరు సైదాపురం (Saidapuram) గ్రామంలోని ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు వందమంది దళితులు, సీనియర్ నాయకులు గురువారం బీఆర్ఎస్(BRS)లో చేరారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి సీటు ఆశించి భంగపడిన పూలెపాక లావణ్య శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి సుమలతా శ్రీకాంత్, పూలెపాక నిరీక్షణా రాణి, పూలెపాక మల్లేశ్, వినయ్, మౌనికా మురళీకృష్ణ, లక్ష్మీ, కోట ప్రవీణ్ గులాబీ కండువా కప్పుకున్నారు. పట్టణంలో గొంగిడి నిలయంలో ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితోపాటు మరో వందమంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఅర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.