యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ)/భువనగిరి కలెక్టరేట్ : సుదీర్ఘ ప్రజా ప్రస్థానంలో మల్లయ్య గుప్తా(97) చెరుగని జ్ఞాపకాలను వదిలి వెళ్లారు. భువనగిరి ప్రాంతంలో అందరికి సుపరిచితులైన జైని మల్లయ్య మృతి ఈ ప్రాంత ప్రజలను తీవ్రంగా కలచివేసిందనడంలో అతిశయోక్తి లేదు. భువనగిరి పట్టణంలో 1926 అక్టోబర్ 11న లక్ష్మమ్మ నారాయణ దంపతులకు మల్లయ్యగుప్తా జన్మించారు. ఉర్దూ భాషపై పట్టు సాధించాలనే తలంపుతో మల్లయ్యగుప్తా పంజమ(ఐదో తరగతి) వరకు ఉర్దూలోనే విద్యాభ్యాసం చేశారు. 3వ తరగతి వరకు ఉర్దూ టీచర్ వద్ద తర్వాత 4, 5వ తరగతులు ప్రభుత్వ పాఠశాలలో ఉర్దూ మీడియంలోనే విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. మల్లయ్య గుప్తాకు భార్య సునంద. నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కొడుకు రమేశ్ గుప్తా లక్ష్మీనర్సంహాస్వామి బ్యాం క్లో పనిచేస్తున్నారు. రెండో కుమారుడు భువనగిరిలోనే వ్యాపారం చేస్తుండగా, మూడో కుమారుడు మధుసూదన్‌కు సర్జికల్ ఏజెన్సీ ఉన్నది. నాలుగో కొడుకు బ్యాంక్ ఉద్యోగి. స్వతహాగా స్థితిమంతులైన మల్లయ్యగుప్తా ప్రజాసేవకు ప్రాధాన్యతనిచ్చారు. ప్రజాసేవ, ఉద్యమ తత్వాన్ని కలిగిన ఆయన కమ్యునిస్ట్ భావజాలంతో ముందుకు సాగారు. వృద్ధాప్యంలోనూ ఎవరిపై ఆధారపడకుం డా తన పనులు తానే చేసుకునేవారు. స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్ డబ్బులను ఏదో ఒక సేవా కార్యక్రమానికి ఉపయోగించేవారు.
గ్రంథాలయాల స్థాపనకు కృషి..
విద్య ద్వారానే బానిసత్వానికి విముక్తి లభిస్తుందని, ప్రతి మనిషి చదువుకుంటే బానిసత్వపు సంకెళ్లు పటాపంచలవుతాయనే తలంపుతో గ్రంథాలయాల స్థాపనకు నడుం బిగించారు. 1941 ప్రాంతంలో సరస్వతి గ్రంథాలయాన్ని పెండెం వాసుదేవ్, సిద్దుల బాలరాజు, గుండ్ల కేశవులుతో కలిసి మల్లయ్యగుప్తా గ్రామాల్లో చందాలు వసూలు చేసి దోప్తూరి వీరలింగయ్య అనే వర్తకుడి ఇంట్లో వెయ్యి పుస్తకాలతో గ్రంథాలయాన్ని స్థాపించారు. తదుపరి కొద్ది కాలానికే ప్రభుత్వ పెద్దల నుంచి ఒచ్చిన ఒత్తిడులు ఎక్కువవడంతో కొలనుపాకలోని ఆరుట్ల లక్ష్మీనర్సింహారెడ్డి సహాయాన్ని కోరి వారి సహకారంతో ఐదేండ్లు గ్రంథాలయ నిర్వహణ చేపట్టారు. గ్రంథాలయం మూసి వేసే నాటికి పది వేల పుస్తకాలు గ్రంథాలయంలో సమకూరాయి. అనంతరం 1940లో విఙ్ఞాన ఆంధ్ర భాషా నిలయాన్ని దాత ప్రేమరాజయ్య స్థాపించడంతో గుప్తా తన పూర్తి సహాయ సహకారాలను అందించారు. 1921లో కొలనుపాకలోని బహిరామియా గ్రంథాలయాన్ని ఆదర్శంగా తీసుకుని భువనగిరి గంజ్ ప్రాంతంలో తన మిత్రమండలి సహకారంతో 2,500 తెలుగు, ఉర్దూ పుస్తకాలతో గ్రంథాలయాన్ని ప్రారంభించారు.
ప్రజా చైతన్యానికి నిరంతర శ్రమ..
పాలకులకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరిచేందుకు జైని మల్లయ్యగుప్తా నిరంతరం పాటుపడ్డారు. 1944లో 11వ ఆంధ్ర మహాసభ సంద ర్భం నుంచి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పల్లెపల్లెకు తిరిగారు. ప్రజలను చైతన్యవంతం చేయాలంటే వార్తాపత్రిలకు, పఠనాలయాల(గ్రంథాలయాలు) పాత్ర కీలకంగా ఉంటుందని గ్రహించి 30 వరకు గ్రంథాలయాలను నెలకొల్పారు. గజ్వేల్, భువనగిరి, కొలనుపాక, ఆలేరు, చీకటిమామిడి, గౌరారం, జగదేవ్‌పూర్, వలిగొండ ప్రాంతాల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. మొదటి నుంచి గ్రంథాలయోధ్యమం తో అవినాభావ సంబంధం కలిగిన ఆయనకు ప్రతి ఏడాది నిర్వహించే గ్రంథాలయ వారోత్సవాల్లో సముచిత స్థానం కల్పించేవారు.
ఆంధ్ర మహాసభలో చురుకైన పాత్ర..
1944లో చారిత్రాత్మకంగా మారిన 11వ ఆంధ్ర మహాసభలో భువనగిరిలో రావి నారాయణరెడ్డి అధ్యక్షత వహించగా మల్లయ్యగుప్తా చురుకైన ఉద్యమ కార్యకర్తగా పనిచేశారు. ఈ సందర్భంలోనే దేవులపల్లి వెంకటేశ్వర్రావు, సర్వదేవభట్ల రామనాథం, వట్టికోట ఆళ్వారుస్వామితో ఆయనకు సాన్నిహిత్యం ఏర్పడింది.
నిజాం వ్యతిరేక ఉద్యమంలో..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మల్లయ్య గుప్తా ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. భువనగిరి కేంద్రంగా జరిగిన అనేక సమావేశాలు, సభల్లో ప్రసంగాలు చేశారు. నిజాంకు వ్యతిరేకంగా నడుం బిగించారు. నిజాం ముస్లిం కావడంతో ముస్లింలు ఉద్యమానికి దూరంగా ఉంటే జమ్ముకశ్మీర్ నుంచి వచ్చిన రాజు షేక్ అబ్దుల్లా ద్వారా వారికి అర్థమయ్యేలా చెప్పించి ఉద్యమంలో ముస్లింలు చేరేలా చూశారు.
ఎన్నో పోరాటాలు..
సమాజంలో జరుగుతున్న దురాగతాలను రూపుమాపాలని జైని మల్లయ్యగుప్తా తన మిత్రమండలితో సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. సమాజ సేవ, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటాలు, వితంతు వివాహాల ప్రోత్సా హం, వృద్ధులకు సహాయ సహకారాలు, కుల నిర్మూలన పోరాటాలు, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటాలు, పఠనాలయాల ఏర్పాటు, వయోజన విధ్య, పాఠశాల ఏర్పాటు వంటి ఎన్నో సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టారు. 1946లో భువనగిరిలో మిత్రమండలి ఆధ్వర్యంలో గాంధీ పుట్టిన రోజు వేడుకలను వట్టికోట ఆళ్వార్‌స్వామి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ అనుమతి లేదని కార్యక్రమ నిర్వాహకులు జైని మల్లయ్యగుప్తాను, ఎం.ప్రకాశ్‌రావు, సిద్దుల బాలరాజు, సాదినేని ధర్మయ్యను నిర్భందించి నల్లగొండ జైలుకు పంపి ంచారు. తదనంతరం ప్రజలను చైతన్యపరుస్తూ, అల్లర్లు సృష్టిస్తున్నారనే నెపంతో మల్లయ్యగుప్తాకు బెయిల్ రాకుండా చేసి హైదరాబాద్‌లోని సెంట్రల్ జైలుకు పంపించారు.
16 కేసులు.. జైలు జీవితం
1942లో నిజాం పాలనలో జులుం మొదలైంది. ఆ దారుణాలపై పారాడేందుకు స్నేహితులతో కలిపి బృందంగా ఏర్పడ్డారు. మండీలోని చిన్న వ్యాపారుల సహకారంతో జనంలో చైతన్యం తీసుకువచ్చేలా సమావేశాలు నిర్వహించారు. పూర్తి వివరాలు చెప్పిన 15 రోజులకు గానీ సభ నిర్వహణకు నిజాం నుంచి అనుమతి వచ్చేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్-భువనగిరి మధ్య సంచరిస్తూ రాజ్‌బహద్దూర్ గౌడ్, బూర్గాల నర్సింహారావులాంటి వారితో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఈ క్రమంలో ఆయనపై 16 కేసులు నమోదయ్యాయి. 1946లో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ 10 నెలల జైలు జీవితం గడిపారు. రావినారాయణరెడ్డి, ఆర్య సమాజ్ నరేంద్ర వంటి వారి ప్రభావంతో పోరాటాన్ని తీవ్రతరం చేశారు. అయితే జైలులో స్వామి రామానందతీర్థ, పండిట్ నరేంద్రజీ ఆర్యసమాజ్, మహదేవ్ సింగ్, బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి, రంగారెడ్డి, రామక్రష్ణదూద్, మెల్కొటే, రాజ్బమహదూర్ గౌర్. జువ్వాది రజ్వీ వంటి నాయకులతో సంబంధాలు ఏర్పడ్డాయి. జైల్లో ఉన్నప్పుడు స్వాతంత్య్రం వచ్చాక వీరిని విడుదల చేయకపోవడంతో ఆరుట్ల రామచంద్రారెడ్డికి ప్రత్యేకంగా ఉత్తరాలు రాశారు.
చెరుగని చిరు దరహాసం..
పంచె, లాల్చి ధరించి భుజంపై కండువా కప్పుకుని అనునిత్యం మోముపై చిరు దరహాసంతో కనిపించే మల్లయ్యగుప్తా నేటి తరానికి ఆదర్శప్రాయుడు. భుజంపై కండువా లేనిదే బయటకు అడుగుపెట్టేవాడు కాదు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలపై అవిశ్రాంత పోరాటాలను చేసిన ఉద్యమ దివిటి ఆయన. సినారే అంతటి వారు చెప్పినట్లుగా పంచెకట్టులో ప్రపంచాన మొనగాడు.. కండువా లేనిదే గడపదాటని వాడు జైని మల్లయ్యగుప్తా అంటూ గొప్పగా వర్ణించాడంటే.. మల్లయ్యగుప్తా జీవితం ఎందరికో ఆదర్శమనడానికి అతిశయోక్తి లేదు.
ప్రభుత్వ గుర్తింపు
సాయుధ పోరాటంతో పాటు అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారంలో అలు పెరుగక, అవిశ్రాంతంగా పోరాడిన జైని మల్లయ్యగుప్తాకు భారత ప్రభుత్వం 1972 ఆగస్టు 15న తామ్రపత్రం బహూకరించింది. 1998లో ఉమ్మడి ఏపీ రవీంద్రభారతిలో స్వాతంత్య్ర సమరయోధుడిగా సత్కరించింది. ఉర్దూ భాషపై గుప్తాకు ఉన్న ప్రీతి ఎంతో విశిష్ఠమైనదనడంలో ఎలాంటి సందేహమూ లేదు ఎందుకంటే సుప్రసిద్ధ ఉర్దూ సంస్థలు నిర్వహించే ముషాయిరాలకు ఎంతో ఖర్చు చేసి కార్యక్రమాల్లో పాలుపంచుకునేవారు. ఉర్దూ పట్ల అంతటి ప్రేమాభిమానాలు కలిగిన గుప్తాను భువనగిరి అంజుమన్ టర్కీకి ఉర్దూ శాఖ అధ్యక్షుడిగా వ్యవహరించడం ఎంతో గర్వకారణం.
ప్రముఖుల నివాళి
చిక్కడపల్లి : జైని మల్లయ్య గుప్తా అంత్యక్రియలను అంబర్పేట్ శ్మశానవాటికలో గురువారం నిర్వహించారు. అంతకుముందు మల్లయ్యగుప్తా పార్థీవదేహాన్ని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, పశ్యపద్మ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ప్రజాపక్షం సంపాదకుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర నాయకుడు పల్లా నరసింహారెడ్డి, సీపీఎం రాష్ట్ర నాయకుడు చెరుపల్లి సీతారాములు, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరీ గౌరీశంకర్, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రజా గాయకుడు గద్దర్, ప్రతాప్‌రెడ్డి, పాశం యాదగిరి, కాచం సత్యనారాయణ గుప్తా, సీపీఐ ముషీరాబాద్ కార్యదర్శి బి.వెంకట్స్వామిగౌడ్ సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
మల్లయ్య గుప్తా జీవితం నేటి తరానికి ఆదర్శం:ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి
భువనగిరి అర్బన్, డిసెంబర్ 22 : స్వాతంత్య్ర సమర యోధుడు జైని మల్లయ్య గుప్తా మృతి తీరని లోటు అని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి అన్నారు. మల్లయ్య గుప్త పార్థీవదేహాన్ని గురువారం ఆయన సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ మల్లయ్య గుప్త జీవితం నేటి తరానికి ఆదర్శమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అమరేందర్ పాల్గొన్నారు.
సీపీఎం నాయకుల నివాళి
భువనగిరి సిటీ : స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు పార్టీ నాయకుడు జైని మల్లయ్యగుప్తా మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగిర్ అన్నారు. మల్లయ్యగుప్త పార్థీవదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనూరాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యుడు గడ్డం వెంకటేశ్, ప్రజా సంఘాల నాయకులు వనం రాజు, ఈర్లపల్లి ముత్యాలు, వడ్డెబోయిన వెంకటేశ్, కొల్పుల వివేకానంద పాల్గొన్నారు.