ఆలేరు టౌన్, ఆగస్టు 08 : బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ శాసనసభ ఆమోదాన్ని కేంద్ర ప్రభుత్వం బేషరతుగా ఆమెదించి, అమలు చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఆర్.జనార్ధన్, డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్ డిమాండ్ చేశారు. పార్లమెంట్లో బిల్లు పెట్టాలని, 9వ షెడ్యూల్డ్ లో చేర్చడానికి రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. శుక్రవారం ఆలేరులో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బీసీ పరిధిలో ఉన్న ముస్లిం రిజర్వేషన్లను, వారికి గల చట్టబద్ధతను బీజేపీ వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్లలో ముస్లిం లను తొలగించమని, బీసీలకు మొత్తంగా 42 శాతం ఉండాలని అంటున్నాయని ఆ విధంగా బీసీల రిజర్వేషన్ పెంపుదలను బీజేపీ అడ్డుకుంటుందన్నారు.
ఆర్డినెన్సుపై రాష్ట్ర గవర్నర్ సంతకం చేయలేదని, గవర్నర్ స్పందన సహేతుకంగా లేదన్నారు. బీసీ సంఘాలుగా, వ్యక్తులుగా ఉన్న ప్రముఖులు అవకాశవాదంతో భిన్న వాదనలు వినిపిస్తున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగ హక్కుగా వెనుకబడిన కులాలు, ముస్లింలు రిజర్వేషన్లను సుదీర్ఘకాలంగా అనుభవిస్తున్నారని, సచార్ కమిటీ నివేదిక తదనంతరం బీజేపీ ప్రభుత్వం ముస్లింల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా విద్వేషాన్ని రెచ్చగొడుతుందని ఆరోపించారు. బీసీ సంఘాలు, వ్యక్తులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడికి ఐక్య ఆందోళనలు చేపట్టాలని, అందుకు సీపీఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కులగణన, జన గణనను కేంద్ర ప్రభుత్వం చేపట్టాలన్నారు. వారి వారి జనాభాను పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్లలో తగిన మార్పులు చేయాలని డిమాండ్ చేశారు.