బీబీనగర్, అక్టోబర్ 16 : సీపీఆర్‌పై అవగాహన సామాజిక బాధ్యత అని బీబీనగర్ పీహెచ్సీ వైద్యురాలు మౌనికా రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లు, ఆశాలు, మెడికల్ సిబ్బందికి సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒత్తిడితో కూడిన జీవన విధానం, శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా ఆకస్మిక గుండెపోట్లు పెరిగినట్లు తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సీపీఆర్ (కార్డియాక్ పల్మనరీ రిససిటేషన్), లైఫ్ సేవింగ్ టెక్నిక్స్‌పై అవగాహన కలిగి ఉండడం సామాజిక బాధ్యతగా భావించాలన్నారు.
ఇటీవల సమాజంలో గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయని, వయస్సుతో నిమిత్తం లేకుండా వస్తున్నాయన్నారు. ఆస్పత్రికి వచ్చిన వారు కావచ్చు, బయట ఎక్కడైనా కావచ్చు గుండెపోటుతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారికి వెంటనే సీపీఆర్ చేసి మెడికల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందానికి సమాచారం ఇవ్వాలన్నారు. అకస్మాత్తుగా కొందరికి గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, అలాంటి వారికి సీపీఆర్ తో ప్రథమ చికిత్స అందజేస్తే ప్రాణాపాయస్థితి నుంచి బయట పడుతారన్నారు. ఓ వ్యక్తికి ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు, వైద్య సహాయం అందేలోపు ఛాతీని 30 సార్లు ఐదు ఇంచుల మేర కిందకు నొక్కి, 2 శ్వాసలు ఇవ్వడం ద్వారా గుండెను సాధారణ స్థితికి తీసుకురావచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్లు పావని, కాటంరాజు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.