భువనగిరి కలెక్టరేట్, ఆగస్టు 17 : ఈ నెల 20నుంచి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ హనుమంతు కె.జెండగే తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి, అదనపు చీప్ ఎలక్టోరల్ ఆఫీసర్ లోకేశ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.
ఈ నెల 20నుంచి అక్టోబర్ 18వరకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ఉంటుందన్నారు. బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటికీ వెళ్లి కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పు, తప్పుల సవరణ చేస్తారని తెలిపారు. ఒకే చిరునామాపై ఎకువ ఓట్లు ఉన్న వాటిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 29న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. వాటిపై సవరణలు, అభ్యంతరాలకు నవంబర్ 28వరకు స్వీకరిస్తారని, వాటిని డిసెంబర్ 24లోపు పరిషరిస్తారని చెప్పారు.
జనవరి 6న తుది ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందన్నారు. ఓటరు జాబితా రూపకల్పనలో ఇంటింటి సర్వే చాలా ముఖ్యమని, ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, సూపర్వైజర్ల పర్యవేక్షణలో బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటి సర్వే చేపడుతారని, ఇందుకోసం నియోజకవర్గ స్థాయిలో మాస్టర్ ట్రైనర్స్‌తో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. బూత్ లెవల్ ఆఫీసర్ వద్ద ఎలక్టోరల్ జాబితా, పోలింగ్ స్టేషన్ మ్యాప్, వీఐపీ ఓటర్ల వివరాలు ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
బూత్ లెవల్ ఆఫీసర్లు తమ వద్ద ఉన్న బీఎల్ఓ యాప్‌లో ఓటర్ల వివరాలను నమోదు చేస్తారన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి సూచనలు, అభిప్రాయాలను స్వీకరించనున్నట్లు తెలిపారు. ఓటు హకు నమోదు కోసం 18సంవత్సరాలు నిండబోయే యువత వివరాలను బూత్ లెవల్ అధికారుల ద్వారా ముందుగానే సేకరించడం జరుగుతుందన్నారు.
జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో 309 పోలింగ్ స్టేషన్లు, భువనగిరిలో 257 పోలింగ్ కేంద్రాలు.. మొత్తం 566 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో 2,20,795 మంది, ఆలేరు నియోజకవర్గంలో 2,35,220 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు పి.బెన్షాలోమ్, కె.గంగాధర్, భువనగిరి ఆర్డీఓ అమరేందర్, ఎన్నికల విభాగం డిప్యూటీ తాసీల్దార్ సురేశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.