ఆలేరు టౌన్, జులై 07 : ఆలేరు మండల కేంద్రంలో ఆధార్ కేంద్రం లేకపోవడంతో ప్రజలు గత మూడు నెలలుగా అవస్థలు పడుతున్నారు. కొత్త ఆధార్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా, ఇప్పటికే ఉన్న కార్డుల్లో తప్పులను సరిదిద్దాలన్నా, కొత్త పెళ్లి చేసుకుని వచ్చినవారి చిరునామా మార్పు చేయాలన్నా భువనగిరికి వెళ్లాల్సిన దుస్థితి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆలేరు మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆలేరుకు చెందిన షేక్ జానీమియా అన్నారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గం కేంద్రమైన ఆలేరు పట్టణ కేంద్రంలో ఆధార్ సెంటర్ లేకపోవడం విచారకరమన్నారు.
విద్యార్థులు ఆధార్ అప్డేట్ కోసం ఆధార్ సెంటర్కి వెళ్తే సర్వర్ ప్రాబ్లం ఉంది, పనిచేయడం లేదు, భువనగిరకి వెళ్లండని అధికారులు చెబుతున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెంటనే స్పందించి పట్టణ కేంద్రంలో ఆధార్ సెంటర్ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుని, సమస్యను పరిష్కరించాలన్నారు. గతంలో గ్రామీణ వికాస్ బ్యాంక్లో, ఆలేరు హైస్కూల్లో ఉన్న ఆధార్ సెంటర్లను ఎత్తివేయడం దారుణమన్నారు. పోస్ట్ ఆఫీస్లో ఉన్న ఆధార్ సెంటర్ సర్వర్ ప్రాబ్లంతో గత మూడు నెలలుగా పని చేయకపోవడం శోచనీయమన్నారు. ప్రజల ఇబ్బందులను గమనించి ఆలేరులో వెంటనే ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.