Gandhamalla Ravi | యాదగిరిగుట్ట, జూన్ 14: ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వ్యక్తిగత కార్యదర్శి గంధమల్ల రవి అనుమానాస్పద మృతి పట్ల సమగ్ర విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పాపట్ల నరహరి డిమాండ్ చేశారు. రవి మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని.. అసలు ఆయన ఉరి ఎందుకు వేసుకోవాల్సి వచ్చిందో అర్థం కావడం లేదని తెలిపారు. రాత్రికి రాత్రి మృతదేహానికి తహసీల్దార్‌తో పంచనామా చేయించడమేంటని ప్రశ్నించారు.
అధికారులు, పోలీసులపై ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఒత్తిడి తీసుకొచ్చారని తమకు సమాచారం అందిందని పాపట్ల నరహరి అన్నారు. రాత్రికి రాత్రే మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడం పట్ల బీర్ల ఐలయ్య సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది ఆత్మహత్యనా.. హత్యనా అనేది అధికారులు విచారణ చేపట్టి నిగ్గుతేల్చాలన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గంధమల్ల రవి కుటుంబానికి రూ.5కోట్ల నష్టపరిహారం చెల్లించాలన్నారు. రవి కుమార్తెల చదువు, వివాహ బాధ్యతను ఎమ్మెల్యే తీసుకోవాలన్నారు.