– మహిళా సంఘ భవనం, గ్రంథాలయ నిర్మాణానికి పడమటి సోమారం గ్రామ పంచాయతికి అప్పగింత
బీబీనగర్, జూన్ 01 : బీబీనగర్ మండలంలోని పడమటి సోమారం గ్రామానికి చెందిన స్వర్గీయ మీసాల భిక్షపతి-మణెమ్మ దంపతుల జ్ఞాపకార్థంగా వారి కుమారులు గ్రామాభివృద్ధికి చేయూతనందించారు. గ్రామంలో తాము జన్మించిన తమ సొంత ఇంటి స్థలం సుమారు 240 గజాల భూమిని గ్రామ పంచాయతికి ఉచితంగా అందజేశారు. మీసాల శ్రీనివాస్, ప్రేమ్, వెంకటేష్ ఈ స్థలాన్ని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించేందుకు అంగీకరించి గ్రామ పంచాయతీకి అప్పగించారు. గ్రామ పంచాయతి తీర్మానం మేరకు ఆ స్థలంలో మహిళా సంఘ భవనం, గ్రంథాలయ భవనం నిర్మించేందుకు గ్రామ పంచాయతీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించగా, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధికి తమ కుటుంబం ఎల్లప్పుడూ సహకరిస్తుందని మీసాల కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రజా అవసరాల కోసం కుటుంబ ఆస్తిని విరాళంగా అందించడం అభినందనీయమని గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు వారిని సన్మానించారు. గ్రామంపై కుటుంబానికి ఉన్న మమకారం భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బద్దం అంజయ్య, ఉప సర్పంచ్ తంతరపెళ్లి ప్రదీప్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి వేణు గౌడ్, వార్డు సభ్యులు ఆల్వా లింగారెడ్డి, ఆల్వా పుష్పమ్మ బాల్ రెడ్డి, దేశం శ్రీనివాస్ గౌడ్, దాసరి నాగలక్ష్మి కృష్ణ, నూనె అమృత రాములు, ఆముదాల సదానందం, ఎండి రేష్మ ఉస్మాన్ తో పాటు గ్రామ మహిళలు, పెద్దలు పాల్గొన్నారు.