యాదాద్రి, ఆగస్టు 21 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తజన కోలాహలం నెలకొంది. శ్రావణమాసం చివరి ఆదివారంతో పాటు వరుస సెలవుల నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఎటుచూసినా భక్తులే దర్శనమిచ్చారు. క్యూలైన్ల గుండా తూర్పు ద్వారం, త్రితల రాజగోపురం నుంచి భక్తులు నేరుగా ప్రధానాలయంలోకి వెళ్లి స్వయంభువులను దర్శించుకున్నారు. మూలవర్యుల దర్శనం మహాద్భుతంగా ఉందని పలువురు భక్తులు అభిప్రాయపడ్డారు. ధర్మ దర్శానికి 3గంటలు, వీఐపీ దర్శనానికి 2గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు నిర్వహించిన సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు. భక్తుల గోత్రనామాల పేరిట సంకల్పం జరిపారు.
వైభవంగా నిత్యోత్సవాలు
లక్ష్మీనారసింహుడికి అర్చకులు నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహ హోమం ఘనంగా నిర్వహించారు. సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. కల్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణాన్ని వీక్షించారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. కొండకింద దీక్షాపరుల మండపం వద్ద గల వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్దినీ సమేత రామలింగేశ్వర స్వామికి అర్చకులు, పురోహితులు అభిషేక పర్వాలు ఘనంగా నిర్వహించారు. శ్రావణమాసంలో భాగంగా శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన ఘనంగా నిర్వహిస్తున్నారు. 24రోజులుగా 86.40లక్షల సార్లు లక్ష్మీసహస్ర నామాలను రుత్వికులు పఠించారు. స్వామిని సుమారు 38వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.47,19,956 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. విమాన గోపురం స్వర్ణతాపడానికి యాదగిరిగుట్టకు చెందిన నామని బాలరాజు, నాగలక్ష్మి దంపతులు రూ.1,11,111 విరాళాన్ని ఆలయ ఏఈఓ దోర్భల భాస్కర్శర్మకు అందించారు.