యాదాద్రి, జూన్ 3 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి స్వయంభూ ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం శుక్రవారం సాయంత్రం కోలాహలంగా నిర్వహించారు. ప్రధానాలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారిని పూలు, పట్టువస్ర్తాలతో దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. పరమ పవిత్రంగా జరిగే సేవలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. స్వయంభూ నారసింహుడి ప్రధానాలయం వెలుపల ప్రాకారం అద్దాల మండపం ఊయలలో అమ్మవారిని శయనింపు చేసి గంట పాటు వివిధ రకాల పాటలతో కొనియాడుతూ లాలిపాటలు పాడారు.
స్వయంభువుడికి నిత్యారాధనలు అర్చక బృందం ఘనంగా చేపట్టారు. తెల్లవారుజామున 3గంటల నుంచి పూజలు ప్రారంభమయ్యాయి. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. ఉదయం 4గంటలకు ఆలయాన్ని తెరిచి సుప్రభాతం నిర్వహించారు. బిందెతీర్థం నిర్వహించి లక్ష్మీనారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
ఉదయం సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు స్వామి, అమ్మవార్లకు ప్రాకార మండపంలోని నిత్యతిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి నిజాభిషేకం, సహస్రనామార్చన చేశారు. స్వయంభువుల ప్రధానాలయంలోని ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విడుతలుగా రూ.600 టికెట్ తీసుకున్న భక్తులకు సువర్ణ పుష్పార్చన చేశారు.
బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం చేశారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన చేశారు. స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉచిత దర్శనాలు కొనసాగాయి. పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్య పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రీవారి ఖజానాకు శుక్రవారం రూ. 27,83,227 ఆదాయం వచ్చినట్లు ఆలయాధికారులు తెలిపారు. హైదరాబాద్కు చెందిన భక్తుడు ఎం.పురుషోత్తంరెడ్డి శ్రీవారికి 18గ్రాముల రెండు బంగారు పుష్పాలను ఆలయాధికారులకు శుక్రవారం అందించారు.
శ్రీవారిని రాష్ట్ర జైలు శాఖ డీఐజీ ఎన్.మురళీబాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం అందించగా, ఆలయాధికారులు స్వామివారి ప్రసాదం అందించారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 2,25,950
వీఐపీ దర్శనం 1,95,000
వేద ఆశీర్వచనం 10,200
నిత్య కైంకర్యాలు 5,400
సుప్రభాతం 1,800
క్యారీబ్యాగుల విక్రయం 27,000
వ్రత పూజలు 1,37,600
కళ్యాణకట్ట టిక్కెట్లు 34,600
ప్రసాద విక్రయం 10,00,710
వాహనపూజలు 25,000
అన్నదాన విరాళం 1,59,941
శాశ్వత పూజలు 1,37,500
సువర్ణ పుష్పార్చన 1,45,200
యాదరుషి నిలయం 71,850
పాతగుట్ట నుంచి 41,860
కొండపైకి వాహనాల ప్రవేశం 2,25,000
గోపూజ 100
లక్ష్మీపుష్కరిణి 800
లీసెస్, లీగల్ 3,37,716