అయిటిపాములలో సోలార్ బ్యాటరీ యూనిట్ ప్రారంభం
మహిళా సంఘాలకు ఒప్పంద పత్రాలు అందజేత
కట్టంగూర్, మే 20: మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఆర్ధికంగా ఎదుగాలని రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాట్రోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామంలో ప్రతీక్ ఫౌండేషన్ ఆర్థికసాయంతో స్వబాగ్స్ ల్యాబ్స్ ద్వారా ఏర్పాటు చేసిన స్వచ్ఛ శక్తి ఆప్ గ్రిడ్ కో ఆపరేటివ్ సోలార్ బ్యాటరీ యూనిట్‌ను మంగళవారం ఆయన ప్రారంభించి, మహిళ సంఘాలకు ఒప్పంద పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సౌరశక్తి వినియోగంతో విద్యుత్ ఉత్పత్తి చేసి ఆదాయం సంపాదించేందుకు దేశంలోనే మొట్టమొదటిసారిగా అయిటిపాములలో మహిళ సంఘాల సభ్యులతో సోలార్ బ్యాటరీ యూనిట్లును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళలు ఇంటి వద్ద నుండే ఆదాయం పొందిందేందుకు సోలార్ యూనిట్లు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అభివృద్ధి చెందిన అమెరికా, జపాన్ లాంటి దేశాలు న్యూక్లియర్, థర్మల్ విద్యుత్‌ను పక్కన పెట్టి సోలార్ విద్యుత్ ఉత్పత్తికి వెళ్తున్నారని, దాన్ని దృష్టిలో పెట్టుకుని సోలార్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నల్లగొండ మండలం చర్లపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. మహిళలు ఇంట్లోనే కూర్చుని సోలార్ విద్యుత్ యూనిట్ల ద్వారా నెలకు రూ.2 వేల ఆదాయం సంపాదించవచ్చన్నారు. సోలార్ విద్యుత్ యూనిట్లకు కోతుల బెడద లేకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. మరిన్ని సోలార్ యూనిట్లను మహిళలకు కేటాయించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించాలని నిర్వాహకులకు సూచించారు. రూ.100 కోట్ల అయిటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ పనులతో పాటు కెనాల్ లైనింగ్ పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, జాయింట్ కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్టీఓ యారాల అశోక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ బోళ్ల వెంకట్ రెడ్డి, తాసీల్దార్ గుగులోతు ప్రసాద్, ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు, మండల ప్రత్యేక అధికారి కోటేశ్వర్రావు, ఏపీఓ కడెం రాంమోహన్, ఎఫ్‌పీఓ చైర్మన్ సైదమ్మ, మాజీ జడ్పీటీసీలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ్మ, మాజీ ఎంపీపీ కొండ లింగస్వామి, నాయకులు పెద్ది సుక్కయ్య, రెడ్డిపల్లి సాగర్, బెజవాడ సైదులు పాల్గొన్నారు.