– మహిళ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి
– నకిరేకల్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 2 వేల మందితో బైక్ ర్యాలీ, మానవహారం
నకిరేకల్, సెప్టెంబర్ 08 : రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన వినతి పత్రం సమర్పించి మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్న తీరుపై తీవ్ర ఆవేదనతో వినతిపత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని పోలీసు బలగాల్ని ప్రయోగిస్తూ, గొంతును నొక్కి నియంతృత్వ వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలకు అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో అనేక హామీలు అమలు కాకపోవడమే కాకుండా ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
రైతులకు పెట్టుబడి సాయం, కౌలు రైతులకు రైతు భరోసా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, విద్యార్థులకు విద్యానిధి, పెండింగ్ ఫీజు బకాయిలు చెల్లింపు, పెన్షన్లు, దళితులు, దివ్యాంగులకు ఇచ్చిన పెన్షన్ల వంటి అనేక హామీలలో ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడిగితే సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతోందన్నారు. రైతు, నేతన్నలు, విద్యార్థులు, ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే పోలీసులతో అణచివేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేత ధోరణిని బయటపెడుతోందన్నారు. ప్రజల తరఫున ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులపై కేసులు పెడుతుందన్నారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
చివరికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మరి ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలపై దుర్భాషలాడే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. ప్రజల గొంతును వినాలనే ప్రయత్నం చేయ్యాల్సింది పోయి దాన్ని తొక్కేస్తూ, నిరసన తెలపడాన్నే నేరంగా చూస్తూ, ఆ నిరసనను అణచివేసేందుకు అధికార యంత్రాంగాన్ని ఉపయోగిస్తోందన్నారు. తెలంగాణ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కును కాపాడాలని, ప్రభుత్వాన్ని నిలదీసే హక్కును కాపాడాలని, ప్రజల గొంతును అణచివేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాస్వామ్య విలువల పాఠం చెప్పాలని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.