– ఐద్వా నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ పిలుపు
రామగిరి, జనవరి 22 : అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభల సందర్భంగా ఈ 25వ తేదీన హైదరాబాద్ బస్సు భవన్ గ్రౌండ్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఇంటికో మహిళ తరలి రావాలని ఐద్వా నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ పిలుపునిచ్చినారు. గురువారం నల్లగొండ పట్టణ పరిధి పానగల్లులో ఐద్వా మహాసభల ప్రచారంలో భాగంగా జెండా ఆవిష్కరణ చేసి ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మహిళల హక్కుల రక్షణ, సంక్షేమం, భద్రత, గౌరవం కోసం ఐద్వా నిరంతరం పోరాటాలు చేస్తున్నట్లు తెలిపారు. పసిపిల్లల నుండి వృద్ధుల వరకు మహిళలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, వేధింపులపై రాజీ లేకుండా పోరాడుతుందన్నారు.
ఇప్పటికైనా 33 శాతం రిజర్వేషన్ చట్టసభల్లో అమలు చేయాలని, మహిళలకు పని ప్రదేశాలలో భద్రత కల్పించాలని, మహిళలు, బాలికలకు పౌష్టికాహారం & ఆరోగ్య రక్షణ చర్యలు తీసుకోవాలని, లింగవివక్ష నిర్మూలనకు ప్రభుత్వాలు పురోగతి చూపాలి డిమాండ్ చేశారు. వీటి సాధన కోసం మహాసభల్లో చర్చించి ఉద్యమాలు రూపొందించడానికి మహాసభ వేదిక కాబోతుందని తెలిపారు. మహిళల శక్తి ప్రభుత్వాలకు తెలియజేయడానికి 25వ తేదీన నిర్వహిస్తున్న బహిరంగ సభకు వేలాదిగా మహిళలు తరలివచ్చి ఐక్యతను ప్రదర్శించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ పట్టణ ఉపాధ్యక్షురాలు ఆకటి లింగమ్మ, పట్టణ కమిటీ సభ్యురాలు బుజ్జమ్మ, జయమ్మ, లలిత, రేణుక, లక్ష్మి, లింగమ్మ, భవాని, అంజమ్మ, సునీత పాల్గొన్నారు.