నేరేడుచర్ల, మార్చి 20: నేరేడుచర్ల మండలం దాచారం గ్రామంలో 5.14 ఎకరాల్లో సాగు చేసిన వరిపై గడ్డి మందు స్ప్రే చేయడంతో పంట మొత్తం ఎండిపోయిందని, దీంతో తనకు రూ. 5 లక్షల నష్టం వాటిల్లిందని మహిళా రైతు పేర్వాల శ్రీదేవి వాపోయారు. శుక్రవారం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ 2003లో తాను పొలం కొనుగోలు చేశానని, అప్పటి నుంచి తాను భూమి సాగు చేసుకుంటుండగా 2018లో ధరణిలో తనకు కొత్త పాసుపుస్తకం రాలేదని తెలిపారు. తనకు తెలియకుండా పట్టామార్పు జరగడంతో కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.
2025లో తనకు అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో వరి సాగు చేసుకుంటున్నాని తెలిపారు. ఇదే తీర్పు ఆధారంగా తనకు కొత్త పాసు పుస్తకం కూడా వచ్చిందన్నారు. తనకు వ్యతిరేకంగా ఉన్న కోట్ల సునీత, కోట్ల వెంకటరెడ్డితో పాటు మరి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ నెల 16న తన వరి పొలంలో గడ్డి మందు స్ప్రే చేశారని, నాలుగు రోజులు నుంచి పొలం పూర్తిగా ఎండిపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు.
పొలంలోని మోటార్ స్టార్టర్ కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారని తెలిపారు. ఈ సంఘటనపై విచారణ చేసి తనకు న్యాయం చేయాలని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై ఎస్ఐ రవీందర్‌ను వివరణ కోరగా శ్రీదేవి తన పొలానికి గడ్డి మందు స్ప్రే చేశారని ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. ఈ విషయంపై తహసీల్దార్, వ్యవసాయాధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. పూర్తిస్ధాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.