నల్లగొండ, సెప్టెంబర్ 19 : అడవిదేవులపల్లి మండలం గోన్యతండాకు చెందిన మహిళా రైతు పాతులోతు దస్సి (55) వారం క్రితం రైతు వేదిక వద్ద యూరియా కోసం వరుసలో నిలబడింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో దస్సి కిందపడడంతో కాలు విరిగింది. వెంటనే స్థానికులు, కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ అస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఆమెను నల్లగొండలోని ప్రైవేట్ అస్పత్రికి షిఫ్ట్ చేశారు. గత ఐదు రోజులుగా ఇక్కడ చికిత్స పొందుతుంది.
కాగా దస్సి శుక్రవారం ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురైంది. వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహిస్తుండగానే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆమె మృతదేహన్ని స్వగ్రామం గోన్యాతండాకు తరలించారు. రేపు ఉదయం అత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దస్సి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ స్థానిక నేతలు హెచ్చరించారు.