చౌటుప్పల్, జూన్ 4: చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని 65వ జాతీయ రహదారిపై బుధవారం ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ఘటనలో మహిళ మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం..హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న రెండు కార్లు ప్రమాదవశాత్తు ఒకదానికొకటి ఢీకొని ఎడమవైవు వెళ్లడంతో వెనుకాల నుంచి వస్తున్న లారీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సికింద్రాబాద్‌లోని బోయినిపల్లికి చెందిన నారిశెట్టి శ్రావణి(29) కారులో ఇరుక్కుని అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యింది. రెండు కార్లలోని ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిలో ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీనివాసరావు, హైదరాబాద్‌కు చెందిన విఘ్నేశ్, కట్టంగూర్కు చెందిన యాదగిరి, రేణుక, ధరణి, మణితేజ, మణిభార్గవ్ ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జేసీబీ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. హైవేపై ప్రమాదం జరగడంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. సీఐ మన్మథకుమార్ ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి, దర్యాఫ్తు చేస్తున్నారు.