గరిడేపల్లి, మే 8 : మండలంలో మహిళ హత్య సంచలనం సృష్టించింది. ఆంధ్ర రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కోనాయిగూడెం గ్రామానికి చెందిన నాగలక్ష్మిని సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని కాల్వపల్లి గ్రామానికి చెందిన పారల్ల గోవిందు అతడి భార్య మహాలక్ష్మి కలిసి హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతనెల 24న నాగలక్ష్మి కోనాయిగూడెం నుంచి కోదాడకు వచ్చింది.
విషయం తెలుసుకున్న కాల్వపల్లి మాజీ ఎంపీటీసీ మహాలక్ష్మి ఆమె భర్త గోవిందు కోదాడకు వచ్చిన నాగలక్ష్మిని నమ్మించి కారులో ఎక్కించుకొని మిర్యాలగూడ మండలం ఆళ్ళగడప సమీపంలో హత్య చేశారు. ఆమెను కారులో తీసుకెళ్లి శ్రీశైలం అడవుల్లో పడేశారు. ఈనెల 24న బయటకు వెళ్లిన నాగలక్ష్మి ఆచూకీ తెలియకపోవడంతో ఆమె భర్త చందర్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది.
ఆ తర్వాత కాల్వపల్లి మాజీ ఎంపీటీసీ మహాలక్ష్మి భర్త గోవిందుతో డబ్బుల విషయంలో జరుగుతున్న గొడవను పోలీసులకు చెప్పంది. ఆ కోణంలో పోలీసులు విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. సుమారు 8 ఏండ్లపాటు గోవింద్ ఇంట్లో నాగలక్ష్మి ఆమె భర్త నివాసం ఉంటున్నారు. రెండేండ్ల క్రితం మద్యానికి బానిసై నాగలక్ష్మి భర్త చనిపోయాడు.
అనంతరం నాగలక్ష్మి ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలోని కొనాయపాలెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. కాల్వపల్లిలో గోవిందు ఇంటిలో ఉన్న సమయంలో నాగలక్ష్మికి చెందిన లక్షల రూపాయలను గోవిందు వాడుకున్నాడు. ఇటీవల ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని నాగలక్ష్మి కోరింది. దీంతో ఆమెను వదిలించుకునేందుకు మహాలక్ష్మి భర్త గోవిందుతో కలిసి పథకం ప్రకారం ఈనెల 24న నాగలక్ష్మిని హత్య చేశారు.