నందికొండ, ఏప్రిల్ 8 : నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్‌పై తెలంగాణ వైపు విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలు విధుల నుంచి ఉపసంహరించుకునట్లు ఎన్నెస్పీ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు మూడు రోజుల క్రితమే వెలువడినా సీఆర్పీఎఫ్ బలగాలు డ్యామ్‌పై విధులు నిర్వహిస్తూ వచ్చారు. మంగళవారం సీఆర్పీఎఫ్ బలగాల అధికారులు తాము డ్యామ్ విధుల నుంచి వైదొలుగుతున్నట్లు లిఖిత పూర్వకంగా ఎన్నెస్పీ అధికారులకు సమాచారం అందించారు.
నాగార్జునసాగర్ డ్యామ్ 13వ గేట్ వరకు తెలంగాణ వైపు విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలు విధుల నుంచి వైదలగానే, గతంలో విధులు నిర్వహించిన ఎస్పీఎఫ్ బలగాలు విధుల్లో చేరుతాయని అధికారులు భావించారు. కానీ దానికి భిన్నంగా 13వ గేట్ నుంచి అవతల ఆంధ్రా వైపు వైపు విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలు నాగార్జునసాగర్ డ్యామ్ పైన పూర్తి స్థాయిలో విధులు చేపట్టారు. డ్యామ్‌పై 15 నెలలుగా సీఆర్ఫీఎఫ్ బలగాలు రెండు టీములుగా విడిపోయి ఒక విభాగం తెలంగాణ వైపు ఉన్న డ్యామ్ 13వ గేట్ వరకు, మరో విభాగం 13 గేట్ నుంచి ఆంధ్రా వైపు విధులు చేపడుతూ వచ్చారు.
ప్రస్తుతం నాగార్జునసాగర్ డ్యామ్‌ను ఆంధ్రా వైపు సీఆర్పీఎఫ్ బలగాలు పూర్తి స్థాయిలో తమ ఆధీనంలో తీసుకోవడంపై రాజకీయ విశ్లేషకులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ డ్యామ్ తెలంగాణ వైపు ఆంధ్రా వైపు ఉన్న సీఆర్ఫీఎఫ్ బలగాలు వచ్చి విధులు నిర్వహించడంపై తమకు ఎటువంటి సమాచారం లేదని ఎన్నెస్పీ అధికారులు అంటున్నారు. దీనిపై ఆంధ్రా సీఆర్పీఎఫ్ అధికారులను వివరణ కోరగా తమకు ఉన్నతాధికారుల ఆదేశానుసారం డ్యామ్‌పై పూర్తి స్థాయిలో విధులు చేపడుతున్నామని తెలిపారు.