నీలగిరి, జూన్ 4: మహిళలు, చిన్నారుల్లో రక్త హీనత నివారణకు ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థను తెస్తే ఆ శాఖా అధికారులు మాత్రం పోషకాహార పంపిణీని విస్మరించి పూసల వ్యాపారం చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉం డాలంటే గుడ్లు, పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పకుం డా పూసల దండలు ధరించాలని చెబుతూ అంగన్వాడీ టీచర్లు నుంచి జిల్లా స్థాయి అధికారులతో పూస ల వ్యా పారం చేయిస్తోంది ఓ మహిళా అధికారి. ఏదేమైతే నా కేం.. వ్యాపారం మంచిగా సాగితే చాలు అన్నట్టుగా వ్యవహరిస్తోంది సీడీపీవో స్థాయి అధికారి.
ఇది లా ఉండగా సీడీపీవో వేధింపులను భరించలేక అక్కడి సిబ్బంది మొత్తం డిప్యుటేషన్ల పేరుతో ఇతర ప్రాజెక్టుల్లోకి వలస పోతున్నారు. సీడీపీవో వేధింపుల భయం తో కొత్తగా వచ్చేందుకు ఎవరూ ఆసక్తి కనబర్చడం లేదు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఓ సూపర్వైజర్, జూనియర్ అసిస్టెంట్ అప్షన్ ఇవ్వలేదు అంటే పరిస్థితి అర్థమవుతోంది. వచ్చిన సిబ్బంది వేరే ప్రాంతాలకు వెళ్లడం.. పర్యవేక్షణాధికారి పూసల వ్యాపారంలో మునిగిపోవడంతో ప్రాజెక్టు పరిధిలో పౌష్టికాహారం పంపిణీ కుంటుపడింది.
దీనికి తోడు ఉన్నతాధికారులు సైతం వత్తాసు పలుకుతుండటంతో ఆమె పూసల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. రక్త హీనతను నివారించి ఆరోగ్యవంతమైన సమాజం కోసం ఏర్పాటు చేసిన మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్దేశాన్ని విస్మరించిన అధికారులు ఒత్తిడి నివారణ కోసం పూసలు ధరించాలని ప్రచారం చేస్తున్నారు. పౌష్టికాహారంపై పర్యవేక్షించాల్సిన అధికారి ఆ విషయాన్ని గాలికి వదిలివేయడంతో మునుగోడు ప్రాజెక్టు పరిధిలో చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా అందడం లేదు.
పూసల వ్యాపారం..
మునుగోడు సీడీపీవో కార్యాలయ సిబ్బంది అంతా డిప్యుటేషన్‌పై వెళ్తుంటే ఆ కార్యాలయంలో ఉన్నతాధికారి మాత్రం పూసల వ్యాపారానికి తెర లేపింది. తన కిందిస్థాయి సిబ్బందితోపాటు ఉన్నతాధికారులకు సైతం నెగెటివ్ ఎనర్జీ పోవాలని, మానసిక ప్రశాంతత రావాలంటే తన వద్ద ఉన్న మిషన్‌తో వారిలో శక్తిని చూపించి పలు రకాల పూసల ధరించాలంటూ వ్యాపారం చేస్తోంది. ఏకంగా జిల్లాస్థాయి అధికారికే మూడూ పూసల దండలు ఇచ్చిందంటే సదరు అధికారి పనితనం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
సీట్ల పంచాయితీ..
నల్లగొండ జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలోనూ సీట్ల పంచాయితీ అవుతుంది. పదేండ్లుగా పనిచేస్తున సీనియర్ అసిస్టెంట్ ఇక్కడే తిష్ఠ వేసుకొని కుర్చున్నాడు. గతంలో జరిగిన బదిలీల్లో నకిరేకల్ ప్రాజెక్టుకు వెళ్లగా డిప్యుటేషన్ పేరుతో మళ్లీ జిల్లా కార్యాలయానికి వచ్చారు. జిల్లాపై, ప్రభుత్వ కార్యక్రమాలపై పట్టున్న జిల్లా అధికారి రావడంతో సదరు సీనియర్ అసిస్టెంట్‌కు ఆమెకు మధ్య పలు టెండర్లలో పొరపొచ్చాలు వచ్చాయి. టెండర్లు పెట్టి అనుమతులు ఇచ్చే సమయంలో సదరు సీనియర్ అసిస్టెంట్ సెలవుల్లో వెళ్లేవాడు.
టెండర్ అనుమతులు కాంట్రాక్టర్‌కు ఇవ్వడంలో అనేక ఇబ్బందులు పెట్టేవాడు. ఇలా మూడునాలుగు సార్లు జరిగింది. దీంతో అతడిని తప్పించిన పీడీ అనుములలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్‌ను డిప్యుటేషన్ పేరుతో జిల్లా కార్యాలయానికి రప్పించి గతంలోనున్న సీనియర్ అసిస్టెంట్ డిప్యుటేషన్‌ను రద్దు చేసింది. కానీ అతడు మాత్రం సీటును వదల్లేదు. గురువారం ఇద్దరూ కార్యాలయానికి వచ్చి సీట్‌పై కూర్చోనే క్రమంలో పెద్ద గొడవ జరిగింది. ఇద్దరూ సీట్లు వేసుకొని కూర్చున్నారు.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకూ డిప్యుటేషన్లు
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు డిప్యుటేషన్ ఇచ్చిన చరిత్ర నల్లగొండ జిల్లా అధికారులదే. పని అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగులు కొరత ఉంటే తాత్కాలికంగా పని చేయించడం కోసం ఏజెన్సీల ద్వారా నియమించే ఉద్యోగులకు సైతం డిప్యుటేషన్ ఇచ్చారు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు. జిల్లా కార్యాలయంలో సిబ్బంది కొరత ఉంటే ప్రాజెక్టుల్లో పనిచేసేవారిని ఉన్నతాధికారి ఆదేశాల మేరకు తీసుకోవచ్చు. కానీ ఏకంగా పక్క జిల్లాలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తీసువచ్చి నల్లగొండ జిల్లాలో పనిచేయిస్తున్నారు.
మునుగోడు ప్రాజెక్టులో సీడీపీవో, అసిస్టెంట్ సీడీపీవో, జూనియర్ అసిస్టెంట్, నలుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆరుగురు సూపర్వైజర్లు, అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఒక్క సీడీపీవో మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. అసిస్టెంట్ సీడీపీవో డిప్యుటేషన్ పేరుతో మరో ప్రాజెక్టుకు వెళ్లగా రెండు రోజుల క్రితం జరిగిన బదిలీల్లో మరో ఏసీడీపీవో వచ్చింది. కానీ ఆమె ఇంకా విధుల్లో చేరినట్లు సమాచారం లేదు. నాలుగు మండలాల్లో ఆరు సెక్టార్లు ఉండగా కేవలం నలుగురు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు.
కాగా నలుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉండగా అందులో ఒకరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మిగతా ముగ్గురిలో ఇద్దరు పీడీ కార్యాలయంలో పనిచేస్తుండగా మరొకరు నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాజెక్టులో పనిచేస్తున్నాడు. నల్లగొండ ప్రాజెక్టులో సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు ఉన్నప్పటికీ పది సంవత్సరాలకు పైగా ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇదే ప్రాజెక్టులో భువనగిరి జిల్లాకు చెందిన మరో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇక్కడే విధులు నిర్వర్తిస్తోంది. లేనిచోట సిబ్బంది లేకపోగా ఉన్నచోటుకే డిప్యుటేషన్ ఇవ్వడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.