రూ.45.76 లక్షల కోట్లు ఫట్… ఒక్కరోజే భారీగా కరిగిపోయిన గూగుల్ విలువ
అమెరికా స్టాక్ మార్కెట్లలో టెక్నాలజీ షేర్లు భీకర నష్టాలను చవిచూస్తున్నాయి. గురువారం ఒక్కరోజే గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ షేర్ విలువ నాస్డాక్లో ఏకంగా 12.6 శాతం పడిపోయింది.
- అల్ఫాబెట్ షేర్లలో ఏరులైపారిన నష్టాలు
- మదుపర్లను వెంటాడుతున్న ఏఐ భయాలు
- అమ్మకాల ఒత్తిడిలో టెక్నాలజీ స్టాక్స్
న్యూయార్క్, అక్టోబర్ 30 : అమెరికా స్టాక్ మార్కెట్లలో టెక్నాలజీ షేర్లు భీకర నష్టాలను చవిచూస్తున్నాయి. గురువారం ఒక్కరోజే గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ షేర్ విలువ నాస్డాక్లో ఏకంగా 12.6 శాతం పడిపోయింది. దీంతో కంపెనీ మార్కెట్ వాల్యూ మునుపెన్నడూ లేనివిధంగా 482 బిలియన్ డాలర్లు (డాలర్‌తో పోల్చితే ప్రస్తుత రూపాయి మారకం విలువ ప్రకారం దాదాపు రూ.45.76 లక్షల కోట్లు) హరించుకుపోయింది. ఫలితంగా అగ్రరాజ్య ఈక్విటీ మార్కెట్ల చరిత్రలో ఎన్విదియా (సుమారు 600 బిలియన్ డాలర్లు) తర్వాత సింగిల్ సెషన్లో ఇంతలా నష్టపోయిన కంపెనీగా అల్ఫాబెట్ రికార్డులకెక్కింది. గతంలో అల్ఫాబెట్ అత్యధికంగా జూలై 23న దాదాపు 275 బిలియన్ డాలర్ల నష్టం పాలైంది. నిజానికి 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, కరోనా సమయాల్లోనూ ఏరోజూ కంపెనీ షేర్ వాల్యూ 10 శాతాన్ని మించి పడిపోకపోవడం గమనార్హం.
ఇదీ సంగతి..
అల్ఫాబెట్ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలడం వెనుకనున్న కారణాలను విశ్లేషిస్తే.. ప్రధానంగా ఈ ఏడాది జూలై-సెప్టెంబర్కుగాను కంపెనీ తాజాగా ప్రకటించిన ఆర్థిక ఫలితాలు వాల్‌స్ట్రీట్ అంచనాలను అందుకోలేదు. గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే 25 శాతం పెరిగి 127.6 బిలియన్ డాలర్లుగా ఆదాయం నమోదైంది. ఇందులో గూగుల్ రెవెన్యూ 12 శాతం వృద్ధితో దాదాపు 63 బిలియన్ డాలర్లుగానే ఉన్నది. కానీ 65 బిలియన్ డాలర్లుగా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. నిజానికి జనవరి-మార్చిలో 19 శాతం, ఏప్రిల్-జూన్‌లో 17 శాతం వృద్ధి నమోదైంది. అయితే గూగుల్ క్లౌడ్ రెవెన్యూ మునుపటితో చూస్తే రెట్టింపునకుపైగా ఎగిసి సుమారు 31 బిలియన్ డాలర్లకు చేరింది. జెమినీ యాప్ వినియోగదారులూ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లను దాటారు. అయినా పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది.
నగదు నిల్వలు ఢమాల్
జూలై-సెప్టెంబర్‌లో సర్వర్లు, నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్, డాటా సెంటర్ల వంటి సాంకేతిక మౌలిక సదుపాయాల కోసం అల్ఫాబెట్ 51.4 బిలియన్ డాలర్లను కేటాయించింది. గత ఏడాది మొత్తంగానే 91.4 బిలియన్ డాలర్లుగా ఉన్నది. ఈ నేపథ్యంలో సంస్థ నగదు నిల్వల ప్రవాహం మైనస్ 9.07 బిలియన్ డాలర్లకు దిగజారింది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి చోటుచేసుకున్నది. ఈ ఏడాది మే నుంచి అల్ఫాబెట్ షేర్లు తరచూ భారీగా నష్టపోతూనే ఉన్నాయి. దీంతో దాదాపు ఇప్పటిదాకా 1.4 ట్రిలియన్ డాలర్ల మేర కంపెనీలో పెట్టుబడులు పెట్టిన మదుపర్ల సంపద ఆవిరైపోయింది. ఈ గణాంకాలు సైతం అల్ఫాబెట్ షేర్లను సెల్లింగ్ ప్రెషర్‌కు గురిచేస్తున్నాయి. శుక్రవారం ట్రేడింగ్‌లోనూ షేర్లు నష్టాలకు లోనయ్యాయి.
- అమెరికా స్టాక్ మార్కెట్ల చరిత్రలో అల్ఫాబెట్ నష్టం రెండోదిగా రికార్డు.
- 2004లో కంపెనీ లిస్టింగ్ (అప్పట్లో గూగుల్) జరిగిన దగ్గర్నుంచి ఒక్కరోజే షేర్ ఇంతలా తగ్గడం ఇదే తొలిసారి.
- కరోనా మహమ్మారి, 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంలోనూ ఒకేరోజు కంపెనీకి ఇంతలా వాటిల్లని నష్టాలు.
- 2025లో ఎన్విదియా షేర్ల విలువ ఏకంగా దాదాపు 593 బిలియన్ డాలర్లు పడిపోయింది. ఇప్పటికీ ఇదే అత్యధికం.
- జూన్ 22న 400 బిలియన్ డాలర్లు దిగజారిన స్పేస్ఎక్స్ మార్కెట్ వాల్యూ. ఇప్పటికైతే ఈ నష్టానిది మూడో స్థానం.
- ఈ ఏడాది ఒకేరోజు 200 బిలియన్ డాలర్లు, అంతకంటే ఎక్కువగా అమెరికా స్టాక్స్ నష్టపోవడం ఇది 19వసారి.
- అమెజాన్ షేర్లూ అమ్మకాల ఒత్తిడిలోనే. గురువారం 4 శాతానికిపైగా పతనం.
- 23 శాతం క్షీణించిన ఇంటెల్ షేర్లు. మార్కెట్లో అస్థిరత, తయారీలో ఆటంకాలు, పెరుగుతున్న ఖర్చులే కారణం.
- 4 నెలల్లో చైనా స్టార్50 ఇండెక్స్ 40 శాతం పతనం. పడిపోయిన 480 బిలియన్ డాలర్ల మార్కెట్ వాల్యూ. పెరుగుతున్న ఏఐ ఖర్చులపట్ల మదుపర్లలో నెలకొన్న భయాలకు అద్దం పట్టిన వైనం.
ఏఐ ఖర్చులకు మూల్యం
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలు కృత్రిమ మేధస్సు (ఏఐ)పై విపరీతంగా పెడుతున్న ఖర్చులకు.. ఈ నష్టాలు ప్రమాద ఘంటికలవంటివేనని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారిప్పుడు. నేటి పెట్టుబడులు మున్ముందు రాబడులను తెచ్చిపెడుతాయని కార్పొరేట్లు చెప్తున్న మాటలను నమ్మి ఎదురుచూసే ఓపిక మదుపర్లలో ఉండట్లేదని వారు పేర్కొంటున్నారు. అల్ఫాబెట్ విషయానికే వస్తే.. కంపెనీ మితిమీరి పెడుతున్న ఖర్చులు, ఏఐ ల్యాబ్‌లలో వాటాలకవుతున్న వ్యయం, డాటా సెంటర్ల ఏర్పాటుకు వెచ్చిస్తున్న మూలధనం, ఫలితంగా పడిపోతున్న నగదు నిల్వలు.. ఇన్వెస్టర్లకు ఎంతమాత్రం రుచించలేదని చెప్తున్నారు. కంపెనీ పోకడ.. భవిష్యత్తు లాభాలనూ ప్రశ్నార్థకం చేస్తున్నది మరి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

