రోజుకో టీఎంసీ
కృష్ణా జలాలను ఇష్టారాజ్యంగా తరలిస్తున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్‌ను నిలువరించడంలోనే కాదు, ప్రస్తుతం నీటి వాటాలను తేల్చడంలోనూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చేతులెత్తేసింది.
- శ్రీశైలం నుంచి 79 రోజుల్లో 72 టీఎంసీలు ఎత్తిపోసిన ఏపీ
- చేతులెత్తేసిన కేఆర్ఎంబీ.. నిలువరించని రేవంత్ సర్కార్
- కృష్ణా నీటివాటాల పేచీ మళ్లీ అపెక్స్ కమిటీకే
- కేంద్రానికే నివేదించాలని కేఆర్ఎంబీ నిర్ణయం
- బోర్డు కాలయాపన.. ఏపీ దోపిడీకి పరోక్ష సహకారం
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాలను ఇష్టారాజ్యంగా తరలిస్తున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్‌ను నిలువరించడంలోనే కాదు, ప్రస్తుతం నీటి వాటాలను తేల్చడంలోనూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చేతులెత్తేసింది. మూడు నెలలుగా మీటింగ్‌ల పేరిట సాగదీస్తున్న బోర్డు.. ఇప్పుడు వాటాల అంశాన్ని అపెక్స్‌కు నివేదిస్తామని చెప్పి జారుకున్నది. గతంలోనే ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించగా.. ట్రిబ్యునల్, బోర్డులోనే తేల్చుకోవాలని కేంద్రం స్పష్టంచేసింది.
అయినప్పటికీ, మళ్లీ కేంద్రానికే నివేదిస్తామని చెబుతూ బోర్డు చేతులెత్తేసింది. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలన్నీ అడుగంటిపోయాక, ఇప్పటివరకు మీటింగ్ ఏర్పాటు చేయకుండా తాత్సారం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు సహకరిస్తూ వచ్చిన బోర్డు.. ఇప్పుడు మళ్లీ కేంద్రానికే నివేదిస్తామని చెప్పడం గమనార్హం. అయితే, తెలంగాణ సర్కార్ వైఫల్యమే ఈ పరిస్థితి కారణమని ఇరిగేషన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
నీటి వాటాల పేచీ మళ్లీ అపెక్స్‌కు
కృష్ణా జలాలకు సంబంధించి ట్రిబ్యునల్ కేటాయింపులు లేని నేపథ్యంలో రాష్ట్ర విభజన సందర్భంగా రెండు రాష్ర్టాలు కేవలం ఏడాది కాలానికి తాత్కాలిక ఒప్పందం చేసుకున్నాయి. ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి కృష్ణా జలాలను ఏపీ 66%, తెలంగాణ 34% చొప్పున వినియోగించుకోవాలని తాత్కాలిక ఒప్పందం చేసుకున్నాయి. ఆ తరువాత ప్రతి నీటి సంవత్సరంలోనూ ఆ తాత్కాలిక ఒప్పందాన్ని ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ వచ్చాయి.
అయితే, అవార్డు తేలేవరకు 50:50 నిష్పత్తిలో జలాలను వినియోగించుకుంటామని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 17వ బోర్డు మీటింగ్ నుంచి డిమాండ్ చేస్తూ వచ్చింది. ఈ అంశాన్ని కేంద్ర జల్‌శక్తి శాఖ, అపెక్స్లోనే తేల్చుకోవాలని చెప్తూ బోర్డు సాగదీస్తూ వచ్చింది. అయితే కేంద్ర జల్‌శక్తి శాఖ వాటాల అంశాలన్నీ ట్రిబ్యునల్, లేదంటే బోర్డులోనే నిర్ణయించుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో బోర్డు తీరును నిరసిస్తూ 2022-23 నీటి సంవత్సరంలో ఒప్పందానికి బ్రేక్ పడింది. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక మళ్లీ 2024-25 నీటి సంవత్సరంలో 66:34 నిష్పత్తికే అంగీకరించింది. 2025-26 నీటి సంవత్సరంలో ఒప్పందాల ముచ్చటే ఎత్తలేదు. తాజాగా 2026-27 నీటి సంవత్సరానికి సంబంధించి వాటాల విషయమై ఇప్పటివరకు తేల్చలేదు.
66:34 నిష్పత్తిలోనే రిజర్వాయర్లలోని జలాలను కేటాయించాలని ఏపీ కోరుతుండగా, బేసిన్ పారామీటర్స్ ప్రకారం తెలంగాణకు జలాల్లో 71% వాటా, ఏపీకి 29% వాటా ఉంటుందని తెలంగాణ వాదిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు వాటాలు తేలదు. మరోవైపు, మీటింగ్‌ను సైతం ఏర్పాటు చేయకుండా కేఆర్ఎంబీ సాగదీస్తూ వచ్చింది. తీరా ఇప్పుడు నీటి వాటాల పేచీని మళ్లీ అపెక్స్, కేంద్ర జల్‌శక్తి శాఖకే నివేదించడం గమనార్హం. మొత్తంగా బోర్డు నీటి వాటాలపై చేతులెత్తేసింది. త్వరలోనే 21వ బోర్డు మీటింగ్‌లో ఈ విషయమై చర్చించాలని సైతం నిర్ణయించింది.
12 టీఎంసీలే వాడుకున్న తెలంగాణ
నీటి వాటాలపై సమావేశం ఏర్పాటు చేసి, అందులో నిర్ణయాల మేరకే బోర్డు వ్యవహరించాలి. ఒప్పందాలు పూర్తయిన తరువాతే నీటి విడుదలకు ఉత్తర్వులు జారీ చేయాలి. కానీ, ఈ సీజన్లో ఇప్పటివరకు ఎలాంటి అనుమతుల్లేకుండానే శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి ఇరు రాష్ర్టాలు వేటికవే జలాలు వినియోగించుకున్నాయి. ఏపీ కోటాకు మించి జలాలను వినియోగించుకోవడమే కాకుడా బేసిన్ అవతలికి మళ్లిస్తున్నది. శ్రీశైలం రిజర్వాయర్‌ను ఇప్పటికే ఖాళీ చేసింది.
అయినప్పటికీ, బోర్డు చోద్యం చూస్తున్నది. తక్షణం మీటింగ్ ఏర్పాటు చేసి, నియంత్రించాల్సి ఉన్నా ఆ పనికి పూనుకోలేదు. అక్రమంగా జలాల మళ్లింపు చేపట్టిన అనంతరం, కేవలం నీటి వినియోగాలకు సంబంధించిన సింగిల్ ఎజెండాగా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ కోరడం, ఆ వెనువెంటనే తొలుత ఆగస్టు 13న సమావేశాన్ని బోర్డు ఖరారు చేసింది. ఆ తర్వాత ఏపీ విజ్ఞప్తితోనే మీటింగ్‌ను 17వ తేదీకి, ఆ తదుపరి 24వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున సమావేశం నిర్వహించినా వాటాలను ఖరారు చేయకుండా, మరోసారి సెప్టెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. ఆ తదుపరి నీటి వాటాలపై పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని అక్టోబర్ 1న నిర్వహిస్తామని కేఆర్ఎంబీ ప్రకటించింది.
ఆ సమావేశాన్ని కూడా ఏపీ విజ్ఞప్తి నేపథ్యంలో మళ్లీ అక్టోబర్ 26వ తేదీకి వాయిదా వేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర పర్యటన నేపథ్యంలో దీన్ని వాయిదా వేయాలని తెలంగాణ అధికారులు కోరారు. దీంతో భేటీ 27వ తేదీకి వాయిదా పడింది. అయితే తెలంగాణ విజ్ఞప్తి మేరకే సమావేశాన్ని మరోసారి నవంబర్ 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు బోర్డు ప్రకటించింది. 79 రోజులుగా సమావేశాలు పెట్టకుండా బోర్డు కాలం వెళ్లదీసింది. మరోవైపు శ్రీశైలం రిజర్వాయర్ ఖాళీ అయ్యింది. ఏపీ ఏకంగా 72 టీఎంసీలను తన్నుకుపోయింది. తెలంగాణ 12 టీఎంసీలనే వినియోగించుకున్నది. ప్రస్తుతం ఉన్నది 27 టీఎంసీలే. అందులోనూ వాటా కావాలని ఏపీ డిమాండ్ చేస్తున్నది. ఏపీ నీటి మళ్లింపునకు ఒకవైపు బోర్డు, మరోవైపు తెలంగాణ సర్కార్ సహకరిస్తూ వచ్చాయని అర్థమవుతున్నది.
ముమ్మాటికీ కాంగ్రెస్ వైఫల్యమే
బోర్డు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నా, ఏపీ ప్రతిపాదనలకు మొగ్గు చూపుతున్నా, నీటిని యథేచ్ఛగా మళ్లిస్తున్నా రేవంత్‌రెడ్డి సర్కార్ నోరెత్తడం లేదు. ఏపీ ప్రతిపాదనలకు అనుగుణంగా బోర్డు నిర్ణయాలు తీసుకుంటున్నా నిలదీసిన దాఖలాలేదు. ఏపీ ప్రతిపాదనలకు అడుగడుగునా అనుకూలంగానే వ్యవహరిస్తున్నది. ఇప్పటికీ బోర్డు సమావేశాన్ని, నీటి వాటాల అంశాన్ని తేల్చాలని గట్టిగా డిమాండ్ చేసింది లేదు. గత సంవత్సరం సైతం ఇదే రీతిన వ్యవహరించింది. నిరుడు అంటే 2025-26 నీటి సంవత్సరంలో ఎలాంటి ఇండెంట్లు, నీటి విడుదల ఆర్డర్లు లేకుండానే కృష్ణా జలాలను ఏపీ సర్కార్ భారీ ఎత్తున మళ్లించుకున్నది. రాష్ట్ర విభజన అనంతరం చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా గరిష్ఠ స్థాయిలో దాదాపు 71% జలాలను తరలించుకొనిపోయింది.
ఒక్క పోతిరెడ్డిపాడు ద్వారా 240 టీఎంసీలను మళ్లించుకొనిపోయింది. అదే సమయంలో తెలంగాణ సర్కార్ చరిత్రలోనే లేనంత కనిష్ఠ స్థాయిలో జలాలను వినియోగించుకున్నది. ఇంత జరుగుతున్నా ఏపీని నిలువరించేందుకు రేవంత్ సర్కార్ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. దీన్నిబట్టే కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం ఏరీతిగా ఉన్నదో అర్థమవుతున్నది. తుదకు నీటి సంవత్సరం ముగుస్తుందనే సమయంలో త్రిసభ్య కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి మమ అనిపించారు. ప్రస్తుతం 2026-27 నీటి సంవత్సరంలోనూ నీళ్లన్నీ అయిపోయాక భేటీకి సిద్ధమవడం గమనార్హం. అదీగాక బోర్డు తేదీలను ప్రకటించినా తెలంగాణ సర్కార్ వాయిదాలు కోరుతూ రావడం ఏపీకి సహకరిస్తున్న తీరుకు అద్దంపడుతున్నది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం తక్షణం స్పందించకుంటే రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని నీటిరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

