నీటి వృథాను అరికడితేనే.. కరువు నుంచి రక్షణ
‘కరువు పరిస్థితులను అధిగమించేందుకు ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాలి.. నీటి వృథాను అరికట్టేందుకు అన్నిరంగాల్లో నీటి ఆడిటింగ్ నిర్వహించాలి’ ప్రముఖ పర్యావరణ వేత్త, ప్రొఫెసర్ బీవీ సుబ్బారావు సూచించారు.
- పంటలు వేయొద్దని చెప్పడం సిగ్గుచేటు
- అన్నిరంగాల్లో నీటి ఆడిటింగ్ చేపట్టాలి
- ప్రతిరంగంలో నీటి రీసైక్లింగ్ తప్పనిసరి
- చెరువుల విధ్వంసం వల్లే హైదరాబాద్ నగరంలో తగ్గిన భూగర్భజల సంపద
- ఎల్ నినో, లానినోలో ప్రపంచ జలచక్రాలు
- కరువు నివారణలో అధికారులు విఫలం
- బెంగళూరులో అమలు చేస్తున్న డబుల్ పంబ్లింగ్ నమూనా అమలుకు చట్టంచేయాలి
- తక్షణమే ఎమ్మెల్యే కాలనీ, ఐఏఎస్, ఐపీఎస్ కాలనీల్లో రీసైక్లింగ్ విధానాన్ని అమల్లోకి తేవాలి
- ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో పర్యావరణశాస్త్రవేత్త, ప్రొఫెసర్ బీవీ సుబ్బారావు
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తేతెలంగాణ): ‘కరువు పరిస్థితులను అధిగమించేందుకు ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాలి.. నీటి వృథాను అరికట్టేందుకు అన్నిరంగాల్లో నీటి ఆడిటింగ్ నిర్వహించాలి’ ప్రముఖ పర్యావరణ వేత్త, ప్రొఫెసర్ బీవీ సుబ్బారావు సూచించారు. నీటి వృథాను అరికట్టకపోతే రాబోయే 8 నెలల్లో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. ప్రస్తుత నీటి సంక్షోభం నేపథ్యంలో దశలవారీగా నిర్వహణ పద్ధతులపై దృష్టి సారించడం చాలా ముఖ్యమని, సంక్షోభ నివారణకు స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలని సూచించారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన పలు అంశాలను కూలంకషంగా వివరించారు.
కరువు పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం అన్నిశాఖలకు కార్యాచరణ ఆధారిత సూచనలు చేయాలని, వాతావరణ నిపుణులను, శాస్త్రవేత్తలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. ‘కరువు ఉన్నది, రైతులు పంటలు వేయొద్దు.. అని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటు. ప్రభుత్వ వైఫల్యాలకు ప్రజలను బాధ్యులుగా చూపొద్దు. నగరాల్లో భూగర్భజలాలు తగ్గిపోతున్న పరిస్థితుల్లో నీటి రీసైక్లింగ్ విధానంపై దృష్టి సారించాలి. ఇంటి అనుమతి సమయంలోనే డబుల్ పంబ్లింగ్ పద్ధతి అమలు చేయాలి’ అని చెప్పారు. రాష్ట్రంలో చెరువుల యాజమాన్యం లోపించడం వల్లే, నీటి నిల్వ సామర్థ్యం తగ్గి, భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. నమస్తే తెలంగాణ ప్రశ్నలకు ప్రొఫెసర్ బీవీ సుబ్బారావు తెలిపిన వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఏడాది నుంచి ముందస్తు హెచ్చరికలు ఉన్నా..
ఏడాదిగా ఎల్ నినో వస్తుందనే ముందస్తు ప్రచారం జరుగుతున్నది. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు నివారణ చర్యలు చేపట్టలేదు. 35 ఏండ్లుగా ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు సైతం ఇలాంటి విపత్తుల సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో పాలకులకు సలహాలు ఇచ్చిన పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వ అధికారుల సామర్థ్యం లోపించినట్టు కనిపిస్తున్నది. ప్రభుత్వాలు అధికారంలోకి రావడం, పోవడం సహజం. కానీ ప్రభుత్వ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
కరువును అంచనా వేయలేకపోతున్నారా?
వందేండ్ల క్రితం కరువు, కాటకాలను గుర్తించడానికి, వాటిని ఎదుర్కోవడానికి అవసరమైనంత సాంకేతిక పరిజ్ఞానం లేదు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానంలో ఎంతో పరిణతి వచ్చింది. తెలంగాణ దక్కన్ పీఠభూమి ప్రాంతం. దేశంలో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. అందుకే వందల ఏండ్ల క్రితం హైదరాబాద్‌లో కరువును ఎదుర్కొనేందుకు ప్రతి 2 చ.కి.మీ. ఒక చెరువు, తెలంగాణలో ప్రతి 4 చ.కి.మీ. ఒక చెరువును ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఆ చెరువుల నిర్వహణపై అధికారులకు ఎలాంటి అవగాహన లేదు. హుస్సేన్‌సాగర్ నిర్మాణం జరిగినప్పుడు దానిని నిండడానికి 3 సంవత్సరాలు పట్టింది. చెరువుల నీటినిల్వ సామర్థ్యం పెరిగితే.. వరదలను నివారించవచ్చు. నిల్వ చేసిన నీటిని కరువు సమయంలో వినియోగించుకోవచ్చు. అంతేగాకుండా చెరువు పరిసరాల్లోని సుమారు 4 కి.మీ వరకు భూగర్భ జలాలు పెరుగుతాయి. కానీ ప్రభుత్వం, అధికారులు చెరువుల పునరుద్ధరణపై దృష్టి సారించడమే లేదు.
రాష్ట్రంలో నీటి కొరతకు కారణాలేంది?
హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని అనేక చెరువులు సమైక్య రాష్ట్రంలోనే విధ్వంసమయ్యాయి. తెలంగాణలోని మెట్టప్రాంతాలకు ఆధారమైన చెరువుల మరమ్మతుల గురించి గత 50 ఏండ్లుగా ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. సమైక్య రాష్ట్రంలో ప్రణాళికాబద్ధంగా హైదరాబాద్‌లోని చెరువులను అధికారులు దెబ్బతీశారు. అన్నీ ఆక్రమణలకు గురయ్యాయి. దీంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. విచ్చలవిడిగా బోర్ల వినియోగం కూడా మరొక కారణం.
నగరాల్లో భూగర్భజలాలు తగ్గుదలకు కారణాలేంది?
దేశంలోని ప్రతి నగరానికీ 45 శాతం భూగర్భజలాలే ఆధారం. పైపులైన్ల ద్వారా నీటి సరఫరా అనేది వందశాతం జరుగదు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు, పాలకులు నీళ్లు నిల్వ చేసుకోవడంపై దృష్టి సారించాలి. దానికోసం ముందస్తు ప్రణాళికలు రూపొందించాలి. అప్పుడే కరువును ఎదుర్కోవచ్చు.
కరువును ఎదుర్కోవడంలో ప్రభుత్వ చర్యలు ఎలా ఉన్నాయి?
ఏడాదికాలంగా ఎల్ నినో
పరిస్థితులు వస్తాయని చెప్పినప్పటికీ ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. కరువు వచ్చిన తర్వాత ఉరుకులు, పరుగులు పెట్టడం వల్ల ప్రజల్లో మరింత ఆందోళన, భయాలు పెరుగుతాయి. రైతులు నీళ్లు ఎక్కువ వాడుకుంటున్నారని,
వాళ్లు పంటలు వేయొద్దని చెప్పడం ప్రభుత్వ అవివేకం. కేవలం రైతులే నీటిని వినియోగించడం లేదు. అంతకంటే ఎక్కువ నీటిని వినియోగిస్తున్న రంగాలపై దృష్టిసారించాలి
నీటి వృథాను అరికట్టేందుకు ఏం చెయ్యాలి?
కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రతి నీటి చుక్కనూ సద్వినియోగం చేసుకోవాలి. అందుకు ఏఏ రంగాల వారు ఎంత నీటిని వినియోగిస్తున్నారో అన్న విషయాలను ప్రభుత్వం గుర్తించాలి. అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన్నాన్ని వాడుకోవాలి. మానిటరింగ్ పెంచాలి. కానీ ప్రభుత్వం అలాంటి అంశాలపై దృష్టి సారించడమే లేదు. నగర టౌన్‌ప్లానింగ్, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డులు ఈ విషయంలో విఫలం చెందాయి.
హైదరాబాద్ నీటి కొరతకు ప్రధాన కారణమేంది? ఎలా ఎదుర్కోవాలి?
హైదరాబాద్ మహానగరంలో భూగర్భ జలాలు తగ్గిపోవడంతోనే నీటి కొరత పెరిగింది. ముఖ్యంగా నగరంలో గొలుసుకట్టు చెరువులు విధ్వంసమయ్యాయి. బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలతో నీటి వృథా పెరిగింది. భవన నిర్మాణాల అనుమతుల్లో టౌన్‌ప్లానింగ్ కర్ణాటక విధానాన్ని అనుసరించాలి. అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల్లో వర్షపు నీటిని నిల్వ చేసుకునేలా ప్రభుత్వం నిబంధనలు రూపొందించాలి. నీటి రీసైక్లింగ్ విధానాన్ని అమల్లోకి తేవాలి. అప్పుడే నీటి వృథాను అరికట్టవచ్చు.
ఏఏ రంగాలు ఎక్కువ
నీటిని వినియోగిస్తున్నాయి?
కరువు పరిస్థితుల్లో రైతులు పంటలు సాగుచేయవద్దు. వరి పండించవద్దు అని చెప్తున్న ప్రభుత్వం, అధికారులు.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా అధికంగా నీటిని వృథా చేస్తున్న రంగాలపై ఎందుకు దృష్టి సారించడం లేదు. పరిశ్రమలు, హోటళ్లు, హాస్టళ్లు, పర్యాటక స్థలాలు, దవాఖానలు వంటి రంగాల్లో పెద్ద ఎత్తున నీటి వినియోగం జరుగుతుంది. నీరు వృథా అవుతుంది. ఆయా రంగాల్లో ఎంత నీటిని వినియోగిస్తున్నారనే లెక్కలు ప్రభుత్వం వద్ద లేనేలేవు. ఇప్పటికీ ఆయా రంగాల్లో పెద్ద ఎత్తున నీటి వినియోగం జరుగుతున్నది. పారిశ్రామిక ప్రాంతాల్లో రైతులు పంటలు సాగు చేయకుండా పరిశ్రమలకు నీటిని విక్రయిస్తున్నారు. ముఖ్యంగా సంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ పరిస్థితి ఉన్నది. కానీ ప్రభుత్వాలు వాటిని అరికట్టడం లేదు.
రాబోయే 8 నెలల్లో పరిస్థితులెలా ఉంటాయి?
రాబోయే 8 నెలలు ఒక్కోక్క రోజు మరింత క్లిష్టంగా మారుతాయి. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలపై తీవ్రమైన భారం పడుతుంది. మురికివాడల్లో మరింత అధ్వాన పరిస్థితులు ఉంటాయి. నీటి కొరతతోపాటు ఆహార సమస్య, ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి.
నీటి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలేంది?
కరువు పరిస్థితులను అధిగమించేందుకు తక్షణమే ఉన్న నీటిని సద్వినియోగం చేసుకునే చర్యలు చేపట్టాలి. పరిశ్రమలు, హోటళ్లు, అపార్టుమెంట్లు, దవాఖానలు, హాస్టళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఎమ్మెల్యేల క్వార్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్లలో తక్షణమే నీటి రీసైక్లింగ్ చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం మెట్లబావుల పునరుద్ధరణ పేరుతో రూ.450 కోట్లను ఖర్చు చేస్తున్నట్టు ప్రకటనలు చేస్తున్నది. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. మెట్లబావుల పునరుద్ధరణతో భూగర్భజలాలు పెరుగుతాయనేందుకు శాస్త్రీయ ఆధారాలు కానీ, రికార్డులు కానీ లేవు. శుద్ధి చేసుకునే నీటిని వినియోగించే విధంగా చట్టం తేవాలి. అప్పుడే ఎక్కడికక్కడ నీటి సమస్యను పరిష్కరించవచ్చు.
బెంగళూరులో ఎలాంటి పాలసీ అమల్లో ఉన్నది?
బెంగళూరులో వర్షపునీటిని ప్రతి ఇంటిలో సంరక్షిస్తారు. సంరక్షించిన నీటిని ముందుగా వినియోగించి, ఆ తర్వాత మిగులు నీటిని మాత్రమే ఇంకుడుగుంతల్లోకి వదులుతారు. అంతేగాకుండా ప్రతి ఇంటికీ డబుల్ ప్లంబింగ్ వ్యవస్థ ద్వారా టాయిలెట్లను ఫ్లష్ చేయడానికి శుద్ధిచేసిన నీటిని ఉపయోగిస్తున్నారు. తెలంగాణలోనూ ఈ డబుల్ ప్లంబింగ్ విధానాన్ని తప్పనిసరి చేయాలి.
కరువుతో ఎవరు ఎక్కువగా ప్రభావితం అవుతారు?
అధిక ఉష్ణోగ్రతల వల్ల, కరువు పరిస్థితుల వల్ల ఎక్కువగా వయోవృద్ధులు, మాతాశిశువులు తీవ్ర ఇబ్బందులు పడుతారు. అందుకు అనుగుణంగా వీరి రక్షణకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఉపాధి దెబ్బతినకుండా ఉపాధి హామీని పకడ్బందీగా అమలు చేయాలి. పట్టణాల్లో కూడా ఉద్యోగహామీ పథకం కింద టింక్ ట్యాంకులను అనుసంధానం చేసి, నీటిని సమర్థవంతంగా ఉపయోగించడంపై ప్రజలకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. నీటి నిర్వహణకు సంబంధించిన విభాగాల్లో అవినీతిని అరికట్టాలి. భూగర్భజలాలను ఉమ్మడి ఆస్తిగా ప్రకటించాలి. భూగర్భజలాల వినియోగ నిబంధనలు సమీక్షించి, సవరించాలి. సవరించిన నిబంధనలను అధికారికంగా నోటిఫై చేయాలి. కరువు పరిస్థితుల వల్ల బస్తీలు, బలహీనవర్గాల పట్టణ నివాసాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలి.
కరువు పరిస్థితుల నేపథ్యం?
కరువు కాటకాలు దక్షిణ భారతదేశానికి సర్వసాధారణం. వందల ఏండ్ల క్రితమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో కరువు కాటుకు వందలాది మంది మృత్యువాత పడ్డారు. కరువు పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు పాలనారంగం పటిష్టమైనా కార్యాచరణను రూపొందించి, కరువు పరిస్థితులను అధిగమించాలి. దురదృష్టవశాత్తు ఆ సామర్థ్యం ఈనాటి చాలామంది పాలక వర్గాల్లో లోపించింది. జలచక్రాలు అనేవి ప్రపంచ స్థాయి ప్రక్రియ. ఎల్ నినో పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు పెరిగి వర్షాలు కురువకపోవడం, లెనినా సమయంలో అధిక వర్షాలు కురువడం.. ప్రతి ఆరేడు ఏండ్లకూ ఒకసారి ఇలా జరుగుతుంది. అధికార యంత్రాంగం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలి. సాధారణంగా ఎండాకాలం నీరు ఆవిరిగా మారడం, చలికాలంలో స్థిరంగా ఉండటం, వానకాలంలో వర్షాలు కురువడం జరుగుతుంది. కానీ వాతావరణంలో వస్తున్న మార్పులతో ఈ సైకిల్ దెబ్బతిన్నది. మారుతున్న పరిస్థితులను సమీక్షించి శాస్త్రవేత్తలు, నిపుణులు ప్రభుత్వాలకు సలహాలు ఇవ్చాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

