‘భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలనే డిమాండ్ రాగానే చెప్పా పెట్టకుండా మాయమైండు. బీసీలకు టికెట్ ఇవ్వాలని కోరగానే రాత్రికి రాత్రి పార్టీ మారిండు. కనీసంనాయకులు, కార్యకర్తలతో చర్చించకుండా ఇష్టారాజ్యంగా కాంగ్రెస్‌ను వదిలిపోయిండు. ఇప్పుడు బీసీలకు కాదని, టికెట్ ఇస్తామనగానే క్షణాల్లోనే కాంగ్రెస్ కండువా కప్పుకున్నడు. అంటే బీసీలకు టికెట్ ఇస్తే అంత ఓర్వలేని తనమా? బీసీల వ్యతిరేకి కుంభం అనిల్‌కుమార్ రెడ్డి’ అని కాంగ్రెస్‌లోని ఓ వర్గం మండిపడుతున్నది.
కాంగ్రెస్‌లో కుంభం అనిల్ కుమార్‌రెడ్డి చేరికతో ఆ పార్టీలో కాక రేగింది. మళ్లీ పాత పంచాయితీలు షురూ అవుతున్నాయి. రెడ్ల పార్టీగా పేరొందిన కాంగ్రెస్‌లో బీసీలకు అన్యాయం జరుగుతున్నదని ఆ పార్టీ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనిల్ కుమార్‌రెడ్డి చేరికపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆయన వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్నారు. బీసీ అభ్యర్థి డిమాండ్ రాగానే పార్టీ మారారని, ఇప్పుడు టికెట్ ఇస్తామనగానే వెంటనే పార్టీలో చేరారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ వ్యతిరేకిగా మారిన కుంభం అనిల్‌కు ఎన్నికల్లో సహకరించవద్దని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో అంతా కలిసి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. బీసీ వ్యతిరేక ముద్ర పడిన కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరేందుకు పలువురు నాయకులు సమాయత్తమవుతున్నారు.
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్‌లో కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేరికతో పార్టీలో కాక రేగింది. హస్తం పార్టీలో మళ్లీ పాత పంచాయితీలు షురూ అవుతున్నాయి. రెడ్ల పార్టీగా పేరొందిన కాంగ్రెస్‌లో బీసీలకు అన్యాయం జరుగుతున్నదని ఆ పార్టీ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనిల్ కుమార్ రెడ్డి చేరికపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆయన వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్నారు. బీసీ అభ్యర్థి డిమాండ్ రాగానే ఇష్టారాజ్యంగా పార్టీ మారారని, ఇప్పుడు టికెట్ ఇస్తామనంగానే వెంటనే పార్టీలో చేరారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ వ్యతిరేకిగా మారిన కుంభం అనిల్‌కు ఎన్నికల్లో సహకరించవద్దని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో అంతా కలిసి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. బీసీ వ్యతిరేక ముద్ర పడిన కాంగ్రెస్‌ను వీడి.. బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు సమాయత్తమవుతున్నారు.
కుంభం అనిల్ కుమార్ రెడ్డి రెండు నెలల క్రితం వరకు యాదాద్రి భువనగిరి డీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. క్రియాశీలకంగానే పనిచేస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ లోక్‌సభకు రెండు బీసీ స్థానాలు ఇస్తామనే అంశం తెరపైకి వచ్చింది. దాంతో భువనగిరి నియోజకవర్గంలో బీసీకి టికెట్ ఇవ్వాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వినిపించింది. బీసీ నేతలంతా పలు దఫాలుగా సమావేశమయ్యారు. అన్ని మండలాల నేతలతో చర్చించారు. ఈ నేపథ్యంలో బీసీలకు టికెట్ ఇస్తారని భావించిన కుంభం అనిల్ కుమార్‌రెడ్డి ప్లేట్ ఫిరాయించారు. బీసీలకు టికెట్ ఇస్తే తానేం చేస్తానని భావించిన ఆయన రెండు నెలతల క్రితం హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలను కాదని, టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో మళ్లీ తాజాగా హస్తం గూటికి చేరారు.
బీసీలకు టికెట్ గాయబ్..!
కాంగ్రెస్ పార్టీలో బీసీలకు టికెట్ నినాదంతో పలువురు బీసీ నేతలు పోటీలోకి వచ్చారు. భువనగిరి నియోజకర్గంలో నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా ఎగరలేదని, ఈ సారైనా గెలవాలని గట్టిగా అనుకున్నారు. అయితే కుంభం పార్టీ మార్పుతో కాంగ్రెస్‌కు పట్టిన శని పోయిందనుకుంటే మళ్లీ వచ్చి పడిందని కేడర్ వాపోతున్నది. టికెట్ కోసం బీసీలు రామాంజనేయులు గౌడ్, పచ్చిమట్ల శివరాజ్గౌడ్తోపాటు మరికొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల హస్తినకు వెళ్లి అధిష్టానం వద్ద లాబీ చేసే ప్రయత్నం చేశారు. టికెట్ ప్రకటించడమే మిగిలి ఉంది. ఇప్పుడు కుంభం రాకతో బీసీలక దక్కాల్సిన టికెట్ గాయబ్ అయ్యింది.
అనిల్‌ది అంతా ఇష్టారాజ్యం..
కుంభం అనిల్ కుమార్ రెడ్డి మొదటి నుంచి అంతా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. పార్టీ వ్యవహారాలు, కమిటీల నియామకం, కార్యక్రమాల్లో అన్నీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారని ఆయనకు దగ్గరు ఉన్న నేతలే ఆరోపిస్తున్నారు. రెండు నెలల క్రితం పార్టీ మారినప్పుడు సైతం ఎవరికి చెప్పలేదని వాపోతున్నారు. భువనగిరి సమావేశం ఏర్పాటు చేసి.. ఉన్నపళంగా ఎవరికీ చెప్పకుండా, చర్చించకుండా పార్టీ మారారని చెప్పుకొస్తున్నారు. ఆయన అవసరాల కోసం పార్టీ మారి.. తమని కూడా మారాలని కోరినా తాము మారలేదంటున్నారు. ఇప్పుడు మళ్లీ ఏకపక్షంగా పార్టీలో చేరారని వివరిస్తున్నారు.
ఎన్నికల్లో సహకరించం
బీసీలకు అణగదొక్కుతున్న కుంభం అనిల్‌కు సహకరించబోమని కాంగ్రెస్‌లోని ఓ వర్గంతోపాటు బీసీ నేతలు బహిరంగంగానే అంటున్నారు. ఆయన స్వార్థ రాజకీయాలకు తాము బలి అవుతున్నాయమనే భావనలో వారంతా ఉన్నారు. మొదటి నుంచి ఆయన బీసీలకు మొండిచెయ్యే చూపిస్తున్నారు.
అనేక విషయాల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. రెడ్లనే ముందుండి నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే బీసీలంతా ఏకమై సమావేశం కానున్నట్లు తెలిసింది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
బీఆర్ఎస్ వైపు బీసీల చూపు..
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తున్నది. బీసీ బంధుతోపాటు నేతన్నలు, రజకులు, ముదిరాజ్‌లు, గౌడ్లు, యాదవులకు ప్రత్యేక పథకాలను తీసుకొచ్చి సమర్థంగా అమలు చేస్తున్నది. బీసీ నేతలకు రాజకీయంగానూ మంచి అవకాశాలు కల్పిస్తున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లోని ఓ వర్గంతోపాటు.. బీసీ నేతలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. త్వరలో గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ తగలనుంది.