పెద్దఅడిశర్లపల్లి, ఆగస్టు 11 : ఎగువన కురిసిన వర్షాలకు కృష్ణమ్మ పరుగులు తీస్తుంది. రిజర్వాయర్ల నుంచి లక్షల క్యూసెక్కుల నీరు దుంకుతుంది. కానీ.. రిజర్వాయర్ నుంచి నేరుగా ఉన్న డిస్ట్రిబ్యూటరీకి మాత్రం అధికారుల నిర్లక్ష్యంతో నీరందని పరిస్థితి దాపురించింది. అనుకున్న సమయంలో నీటిని సరిపడా నిల్వ చేయలేక, రిజర్వాయర్ నింపకపోవడంతో డిస్ట్రిబ్యూటరీ – 7బీ కాల్వకు నీరందడం లేదు. దీనికితోడు కాల్వపై నిర్మించిన బ్రిడ్జిల సాంకేతిక లోపంతో 60 క్యూసెక్కులకు గానూ 30 క్యూసెక్కులు కూడా పారని దుస్థితి.
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) పరిధిలోని అక్కంపల్లి బ్యాలెన్పింగ్ రిజర్వాయర్ ఎగువ ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏకేబీఆర్ నుంచి డిస్ట్రిబ్యూటరీ -7బీ కాల్వను నిర్మించింది. దీని ద్వారా ఏకేబీఆర్ నుంచి 242 ఎఫ్‌ఆర్‌ఎల్‌లో నేరుగా 60 క్యూసెక్కుల నీటిని తరలించి పీఏపల్లి, గుర్రంపోడ్ మండలాల్లోని 5,200 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు డిజైన్ చేశారు.
కానీ.. ప్రస్తుతం ఏకేబీఆర్‌లో సరిపడా నీటి మట్టం లేకపోవడతో డిస్ట్రిబ్యూటరీ-7బీ కాల్వ ఎండిపోయింది. ప్రస్తుతం అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 242 అడుగుల దిగువన ఉండడంతో కాల్వలోకి నీరు పారడం లేదు. రిజర్వాయర్ ఉన్న అప్రోచ్ కెనాల్‌కు ఏకేబీఆర్ నీటిమట్టం సరిపోక కాల్వలోకి చుక్క నీరు పారని దుస్థితి ఏర్పడింది. ఏకేబీఆర్ నుంచి పోతిరెడ్డిపల్లి, గుడిపల్లి, జూనూతల వరకు ఇప్పటికే కాల్వ నిర్మాణం పూర్తయింది.
గుడిపల్లి పరిధిలోని పలుగు చెరువు, గార్లకుంట, గర్రంపోడు మండలంలోని మైలాపురం, జూనూతల చెరువులను నింపాల్సి ఉండగా.. వర్షాకాలంలోనే నింపలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చెరువుల కింద ఆయకట్టుతోపాటు భూగర్భ జలాలు కూడా పడిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఏఎమ్మార్పీ నుంచి మూడు మోటార్ల ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
అందులో 520 క్యూసెక్కులు జంట నగరాలకు, వెయ్యి క్యూసెక్కులు ప్రధాన కాల్వకు, మరో మూడు వందల క్యూసెక్కులు లింక్ కెనాల్‌కు, మోటా ర్లు మరియు డీ-7ఎ, డీ-7, 8, 9లకు వదలడంతో ఏకేబీర్ నీటి మట్టం పెరుగని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వరి నాట్ల సీజన్ కావడంతో ఏ కాల్వకూ నీటిని నిలుపుదల చేయలేకపోవడంతో ఏకేబీఆర్ నీటి మట్టం తగ్గి 7బీ కాల్వకు నీరు అందడం లేదు. తక్షణమే నాలుగో మోటార్‌ను రన్ చేసి ఏకేబీఆర్ నీటి మట్టం పెంచి 7బీ కాల్వకు నీటిని విడుదల చేయాలని స్థానిక రైతులు కోరుతున్నారు.
శాపంగా మారిన సాంకేతిక లోపం
గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డిస్ట్రిబ్యూటరీ – 7బీ కాల్వ నిర్మాణంలో సాంకేతిక లోపం ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. అప్పట్లో జిల్లా మంత్రి తన నియోజవర్గంలోని గుర్రంపోడు మండలానికి ఏఎమ్మార్పీ కెనాల్ ఎగువ ప్రాంతానికి సాగునీరందంచాలని ఆగమేఘాల మీద 7బీ కాల్వ నిర్మాణం పూర్తి చేశారు. కానీ.. అధికారుల సాంకేతిక లోపంతో 60 క్యూస్కెకుల డిజైన్ ఉన్న కాల్వ 30 క్యూసెక్కులు మాత్రమే పారుతున్నది. రెండు చోట్ల నిర్మించిన బ్రిడ్జీలు కాల్వ కంటే దిగువకు ఉండడంతో నీటికి అడ్డు తగిలి కాల్వకు గండ్లు పడుతున్నాయి.
గుడిపల్లి వాగుపై నిర్మించిన అక్విడెన్సీ కూడా డిజైన్ లోపంతో నీరు సరిపడా ప్రవహించడం లేదు. 30 క్యూసెక్కులకు మిం చి నీటిని విడుదల చేస్తే కాల్వకు గం డ్లు పడుతున్నాయి. ఇటీవల అంగడిపేట స్టేజీ బ్రిడ్జి వద్ద గండి పడడంతో రైతులే పూడ్చుకోవాల్సిన పరిస్థితి. ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందిం చి డీ-7బీ కాల్వ సాంకేతిక లోపాన్ని సవరించి సరిపడా నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
కాల్వలోకి నీళ్లు సరిగా రావడం లేదు
ఈ కాల్వలో సరిపడా నీళ్లు ఏన్నడూ రావు. ఇప్పుడు సాగర్ నిండా నీళ్లున్నా వదలడం లేదు. మా పొలం పక్కనే బ్రిడ్జి కిందికి కట్టడం వల్ల కాల్వకు గండి పడితే మొన్ననే రైతులు పూడ్చుకున్నారు. మొదట ఉన్న మాకే నీళ్లు సరిగా రాకుంటే కింద వాళ్లకు కష్టమే. నాట్లు వేసుకునే సమయంలో కాల్వల నీళ్లు రాకపోతే ఎలా. కాల్వను సరి చేసి నీళ్లు వదలాలి.
– రమావత్ మంత్రియా, దుబ్బతండా