– మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి
– రూ.16.92 కోట్లతో నిర్మించనున్న ఆర్టీసీ బస్టాండ్, డిపో నిర్మాణ పనులకు శంకుస్థాపన
కోదాడ, జూలై 11 : కోదాడ పట్టణంలో రూ.16.92 కోట్లతో నిర్మించనున్న అత్యాధునిక టీఎస్ఆర్టీసీ బస్టాండ్, డిపో నిర్మాణ పనులకు శనివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి శంకుస్థాపన చేశారు. ఐదున్నర ఎకరాల్లో ప్రయాణికుల సౌకర్యాలు, వాణిజ్య సముదాయాలతో బస్టాండ్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కోదాడ బస్టాండ్‌ను రాష్ట్రంలోనే ఆదర్శ బస్టాండ్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా రోజుకు 30 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారని, ఇప్పటివరకు 326 కోట్లకు పైగా ప్రయాణాలు నమోదై రూ.11,406 కోట్ల మేర మహిళలకు ప్రయాణ ఖర్చు ఆదా అయ్యిందన్నారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కోదాడ నియోజకవర్గంలో రవాణా, విద్య, వైద్యం, సాగునీటి రంగాలకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి మాట్లాడుతూ ఆధునిక సౌకర్యాలతో బస్టాండ్ నిర్మాణం పూర్తయితే కోదాడకు ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు. అనంతరం కోదాడ–నరసింహులగూడెం–మోతే మార్గంలో కొత్త ఆర్టీసీ బస్సు సర్వీసును మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.