నీలగిరి, మార్చి12 : ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయల కల్పించి, ఖాళీగా ఉన్న వైద్య పోస్టులతో సహా ఇతర పోస్టులను నెల రోజుల్లో భర్తీ చేయనున్నట్లు తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ శివరాంప్రసాద్ తెలిపారు. బుధవారం నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ఆయన పరిశీలించారు. ఐసీయూ, క్యాజువాలిటీ, ఎంసీహెచ్ వార్డులతో పాటు పలు వార్డులు కలియతిరిగారు. రోగులు, వారి సహయకులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఆనంతరం మెడికల్ కళాశాలను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యలు, టెక్నికల్ సిబ్బందితో పాటు పారిశుద్ధ్యం, సెక్యూరిటీ ఇతర అన్ని రకాల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో వైద్యుల కొరత ఉన్నది వాస్తవమేనని అందుకోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ ను విడుదల చేసినట్లు తెలిపారు. రెండు మూడు రోజుల్లో 80 మంది సీనియర్ ప్యాకల్టీలను కౌన్సిలింట్కు పిలిచి ఆస్పత్రులకు కేటాయించనున్నట్లు తెలిపారు. సిబ్బందిని పెంచడంతో పాటు రోగులకు అసరపమైన మందులను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు.
బెడ్ల కెపాసిటీకి మించి ఆస్పత్రికి రోగులు వస్తున్నందున అందుకు తగ్గట్టుగా త్వరలో ప్రణాళికలు తయారు చేసి ప్రజా వైద్యాన్ని బలోపేతం చేస్తామని చెప్పారు. నల్లగొండ ఆస్పత్రిలో 550 పడకలు ఉండగా సిబ్బంది, వైద్యులు అందుకు తగ్గట్టుగా లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది తలెత్తుతుందన్నారు. నెల రోజుల్లో పారిశుద్య, సెక్యురిటీ ఇతర స్టాప్ నర్సుతో పాటు పలు రకాల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ఆరుణకుమారి, డిప్యూటీ సూపరింటెండెంట్ డా.నగేశ్, ఐసీయూ ఇన్చార్జి డా.రమేశ్ పాల్గొన్నారు.