చందంపేట, నవంబర్ 3: ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను పూర్తి చేసి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఎస్ఎల్బీసీ ఏరియల్ సర్వేలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని మన్నెవారిపల్లిలో సోమవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి హెలీ మాగ్నెటిక్ ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకం పనుల పునరుద్ధరణలో మాగ్నెటిక్ జియోఫిజికల్ ఇనిస్టిట్యూట్(ఎన్జీఆర్ఐ) శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తామన్నారు.
హెలికాప్టర్‌కు ప్రత్యేకంగా అమర్చిన ట్రాన్స్మీటరుతో ఈ సర్వే జరుగుతుందన్నారు. ఎస్ఎల్బీసీని పూర్తి చేసి నల్లగొండ జిల్లాలోని 3 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామన్నారు. టన్నెల్-1 4.4 కిలోమీటర్లు, టన్నెల్ 2 మూడు కిలోమీటర్ల మేర ఉంటుందని తెలిపారు. ప్రస్తుత టన్నెల్‌ను ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా తీర్చిదిద్దుతామని, 30 టీఎంసీల నీటితో 3 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందించేందుకు వీలు ఉం టుందని, ఈ టన్నెల్ పనులను రూ.4600 కోట్లతో పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. పనులు చేపడుతున్న క్రమంలో 8 మంది కార్మికులు చనిపోయారని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిపుణులైన ఆర్మీ అధికారులను డిప్యుటేషన్‌పై తీసుకొచ్చామన్నారు. ప్రస్తుతం 9.8 కిలోమీటర్ల మేరకు పనులు చేపట్టాల్సి ఉందని, ఈ పనులను మంత్రివర్గం ఆమోదించినట్లు తెలిపారు. టన్నెల్ లోపల చేపట్టే పనులు టెక్నికల్ సిచ్యువేషన్ నేపథ్యంలో అందరితో సర్వే చేయిస్తున్నట్లు తెలిపారు. అటవీ ప్రాంతంలో చేపట్టే సర్వేలో ఇబ్బందులు ఎదురవుతున్నా పనులు ఆపడం లేదన్నారు. గిరిజనులకు న్యాయం చేసి వారికి నష్టం జరగకుండా ఆదుకుంటామన్నారు. డిసెంబర్ 31లోగా సమస్యను పరిష్కరించే దిశగా బాధ్యత తీసుకుంటానని చెప్పారు.
ఈ విషయంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంతో శ్రమించారన్నారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ పనులు 20 సంవత్సరాలుగా కొనసాగుతున్నా, ఐదేండ్ల నుంచే ప్రారంభమయ్యాయయని, రెండేండ్లలో ఎస్ఎల్బీసీని పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, నేనావత్ బాలూనాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు.