నల్లగొండ : ఆధునిక హంగులతో సోమేశ్వరస్వామి దేవాలయాన్ని నిర్మిస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామం వద్ద గల పచ్చల పార్వతి సోమేశ్వరస్వామి దేవాలయాన్ని దేవాదయశాఖ అధికారులతో కలసి ఆయన పరిశీలించారు.
కాలినడకన కొండపైన కలియ తిరిగి దేవాలయ నిర్మాణానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచలను చేశారు. కొండపైకి ఎక్కే ఘాట్ రోడ్డు, లెవెలింగ్ తదితర అంశాలపై డీపీఆర్లను సిద్ధం చేశారు. సోమేశ్వరస్వామి ఆలయ విశిష్టతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, దేవాలయ నిర్మాణానికి కావాల్సిన అన్ని ప్రతిపాదనలు సమర్పించామన్నారు.
భక్తులకు ఇబ్బంది లేకుండా మోడల్ టెంపుల్ తరహాలో బ్రహ్మాండంగా వసతులను కల్పిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఐదు వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయానికి సకల సౌకర్యాలతో, నూతన హంగులతో భక్తులంతా ఆనంద పడేలా బ్రహ్మాండంగా గుడి నిర్మాణం చేపడుతామన్నారు. తెలిపారు.
ఇప్పటికే కోటి రూపాయలతో పంపిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, త్వరలోనే నిధులు మంజూరు చేయించి పనులను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఖర్చుకు వెనుకాడకుండా, ఇంకా అవసరమైన నిధులను జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రిని ఒప్పించి నిధులు రాబడుతామని ఆయన చెప్పారు.