చందంపేట, ఆగస్టు 07 : హరితహారంలో భాగంగా మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించాలని నల్లగొండ పీడీ శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం చందంపేట మండల కేంద్రంలోని నర్సరీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో నర్సరీలో ఉన్న మొక్కలను ఏపుగా పెంచి, హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాలని ఇందుకు ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించరాదన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీ వనరులను ఎంపీడీఓలు పరిశీలించాలన్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మి, ఏపీఓ వరలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.