నీలగిరి, జూలై 24 : నల్లగొండ పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నల్లగొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ కోరారు. గురువారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో వంద రోజుల ప్రణాళికలో భాగంగా పట్టణంలోని మాంసం దుకాణందారులకు, కిరాణం అండ్ జనరల్ స్టోర్స్ యాజమానులకు ప్లాస్టిక్ సంచుల వాడకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పర్యావరణం కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్లాస్టిక్ నిషేధం ప్రకృతికి ప్రాణవాయువు లాంటిదని తెలిపారు. ప్లాస్టిక్ భూతం రోజురోజు పర్యావరణాన్ని కలుషితం చేస్తుందన్నారు.
ప్రతి ఒక్కరు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 120 మైక్రాన్లకు పైబడిన ప్లాస్టిక్ కవర్లను వాడాలని సూచించారు. పట్టణంలో నిబంధనలు ఉల్లంఘించి నిర్వహిస్తున్న అన్ని దుకాణాలపై దాడులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కోసం సాగే యజ్ఞంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సహాయ కమిషనర్ రవీందర్ రెడ్డి, మున్సిపాలిటీ శానిటరీ సూపర్వైజర్ గడ్డం శ్రీనివాస్, నంద్యాల ప్రదీప్ రెడ్డి పాల్గొన్నారు.