రామగిరి, జూన్ 21 : ఫ్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో అందరూ భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వందేమాతరం రవీంద్ర అన్నారు. నల్లగొండలోని ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా శిక్షణ కళాశాల (బీఈడీ)లో కళాశాల |ప్రిన్సిపాల్ డాక్టర్ మల్యాల పాపయ్య ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన విద్యా సదస్సుకు ఆయన హాజరై ‘మన ఊరు-మనబడి- ప్రస్తుత ధోరణులు- మన బాద్యత’ అనే అంశంపై ప్రసంగించారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో అందరి పిల్లలు అక్కడే చదివేవారని, అద్భుతమైన ఫలితాలు ఉండేవన్నారు. ప్రస్తుతం పేదరికంతో ఉండేవారి పిల్లలు మాత్రమే ప్రభుత్వ బడుల్లో చదువుతున్నట్లు చెప్పారు. అలా కాకుండా అన్ని వర్గాల ప్రజలు, అధికారుల పిల్లలను ఫ్రభుత్వ బడుల్లో చదివిస్తేనే సమానత్వం వస్తుందన్నారు.
ప్రైవేట్ రంగ అభివృద్ధితో ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో ప్రస్తుతం కేవలం 1.5 లక్షల విద్యార్థులు మాత్రమే నూతన అడ్మిషన్స్ తీసుకున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఉన్నత చదువులో 50 శాతం రాయితీ ఇస్తామని, ఉద్యోగాల్లో సహితం ప్రత్యేక అవకాశం ఉంటుందని ఉన్నత విద్యలో ఆదేశాలు తేస్తే ఖచ్చితంగా ఫ్రభుత్వ బడులు బలోపేతం అవుతాయని పలు గణాంకాలతో వివరించారు. అదేవిధంగా పదో తరగతి, టెట్, డీఎస్సీ పరీక్షలు సంసిద్దత- ఒత్తిడి నిర్వహణ పై పోటీ పరీక్షల నిపుణులు తీగల జాన్‌రెడ్డి అవగాహన కల్పించి మాట్లాడారు. ‘ పాఠశాల అభివృద్ది – సామాజిక వనరులు- సమన్వయం’ అనే అంశంపై గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మాజీద్‌పూర్ రంగారెడ్డి జిల్లా వి.విజయ్‌భాస్కర్‌రెడ్డి, నల్లగొండలోని డీవీఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్-ఎంఈడీ అసిస్టెంట్ ప్రొఫెసర్ బొడ్డుపల్లి రామకృష్ణ మాట్లాడి సదస్సులో అందరికి స్ఫూర్తి కలిగించారు.
ఉస్మానియా యూనివర్సిటీ విద్యా విభాగం విశాంత్ర అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ షహనాజ్ బేగం పలు విద్యా అంశాలతో పాటు విద్యారంగానికి ప్రిన్సిపాల్ డాక్టర్ మల్యాల పాపయ్య అందించిన సేవలను వివరించి అభినందించారు. అదే విధంగా మధ్యాహ్నం ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాల్యాల పాపయ్య పదవి విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయనను ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందచేశారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డైట్ ప్రిన్సిపాల్ కె.నర్సింహ్మ, టిఎస్జిహెచ్ఎంఏ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, ఫ్రధాన కార్యదర్శులు వి.సర్ధార్, ఎస్.గిరిధర్‌గౌడ్, డీసీఈబీ కార్యదర్శి కొమ్ము శ్రీనివాస్, విశ్రాంత జిహెచ్ఎం నిర్మల, ఫ్రభుత్వ బీఈడీ కళాశాల సూపరింటెండెంట్ సి.రాఘవేందర్, అధ్యాపకులు టి.సైదులు, సత్యనారాయణ, రవీందర్, మంజుల, పాతిమా, రఫీ, డాక్టర్ సుభాషిణి, పూర్వ విద్యార్థులు, డైట్, ప్రభుత్వ బీఈడీ, డీవీంఎ బీఈడీ కళాశాలల చాత్రోపాధ్యాయులు, గెజిటెడ్ హెచ్ఎంలు, ఎంఈవోలు, ఉపాధ్యాయులు, డైట్ అధ్యాపకులు పాల్గొన్నారు.
Nalgonda : ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతంలో భాగస్వామ్యం కావాలి : వందేమాతరం రవీంద్ర