– నూతన కమిషనర్ శరత్ చంద్రతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్లగొండ, జనవరి 22 : నూతనంగా ఏర్పడ్డ నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆదర్శ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ కమిషనర్‌కు సూచించారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్‌గా నియమితులైన శరత్ చంద్ర నేడు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిషనర్‌కు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కార్పొరేషన్ అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆదర్శ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు.
ఎన్నో ఏళ్ల తర్వాత కార్పొరేషన్ సాధించుకున్నామని, మౌలిక సదుపాయాల కల్పనలో అగ్రగామి నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ అనే విధంగా కష్టపడి పని చేయాలన్నారు. వేల కోట్లతో ఇప్పటికే నల్లగొండ పట్టణంలో చేసిన అభివృద్ది పనులు..ఇటీవల చేపట్టిన అభివృద్ధి పనులు వివరించారు. వాటిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంలో భాగం కావాలన్నారు. సూపర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి నినాదంతో వెళ్తున్నామని అందుకు అనుగుణంగా పారదర్శకంగా పనిచేయాలని మంత్రి కమిషనర్ శరత్ చంద్రకు సూచించారు.