నల్లగొండ, ఏప్రిల్ 29 : 20 ఏండ్లపాటు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి చేయలేని అభివృద్ధిని సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో నాలుగేండ్లలోనే చేశామని, నల్లగొండ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సవాల్ విసిరారు. అభివృద్ధి జరుగలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు. నిరుద్యోగ దీక్ష పేరుతో శుక్రవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నల్లగొండలో సభ ఏర్పాటు చేసి నల్లగొండలో అభివృద్ధి జరుగలేదని మాట్లాడి మంత్రి జగదీశ్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ శనివారం జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డితో కలిసి తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నల్లగొండకు వచ్చిన కాంగ్రెస్ నాయకుల్లో ఎవరికీ సరిగా సుతులు లేవని, రేవంత్, కోమటిరెడ్డితోపాటు ముసలి ఎడ్లు వేర్వేరుగా ర్యాలీగా వచ్చారంటేనే వారిలో ఏ మేరకు ఐక్యత ఉందో అర్థమవుతుందన్నారు. ఔట్ డేట్ అయిన కాంగ్రెస్ నాయకులు మళ్లీ ప్రజలు, యువతను మోసం చేసేందుకు వస్తున్నారని విమర్శించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి గురించి కాంగ్రెస్ ఆలీబాబా బృందం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి నిఖార్సయిన నిప్పులాంటి వ్యక్తి అని, ఆయన గురించి మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. నల్లగొండను ఏ మాత్రం అభివృద్ధి చేయని కోమటిరెడ్డి పిలాయిపల్లి, బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
అభివృద్ధిపై నల్లగొండ నడిబొడ్డులో కూర్చొని చర్చ చేద్దాం.. అభివృద్ధి జరుగలేదని నిరూపిస్తే రాజీనామా చేసి ప్రాణత్యాగం చేసేందుకైనా సిద్ధం.. అందుకు నువ్వు కూడా సిద్ధమా? అని కోమటిరెడ్డిని ప్రశ్నించారు. పానగల్, మర్రిగూడ బైపాస్‌లలో వేయాల్సిన ఫ్లై ఓవర్లను దుప్పలపల్లి, చర్లపల్లిలో వేసి 32 మంది ప్రాణాలను బలిగొన్నది నీవు కాదా అని పేర్కొన్నారు. నువ్వు తీసుకురాలేని బత్తాయి మార్కెట్, మెడికల్ కళాశాల, ఐటీ హబ్‌ను నేను తీసుకొచ్చింది వాస్తవం కాదా? అని అన్నారు. 1200 కోట్లతో నల్లగొండను అభివృద్ధి చేస్తుంటే అది నీ కండ్లకు కనిపిస్తలేదా అని కంచర్ల ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్‌లో గెలిచి నమ్మక ద్రోహం చేసిన నీ తమ్ముడికి మునుగోడు ఎన్నికల్లో ఎలా ఓట్లు వేయమన్నావు అని ప్రశ్నించిన ఆయన ఇంతకు నీవు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తావో ప్రకటించాలని డిమాండ్ చేశారు. నల్లగొండలో పోటీ చేస్తే నిన్ను మరోసారి చిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నానని, నీలాంటి మోసకారిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అనంతరం జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగాల కల్పనలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. పేపర్ లీకేజీలు ఇవ్వాల కొత్తేమీ కాదని, లీకేజీలను ప్రభుత్వమే గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
నల్లగొండలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన భాష సరిగా లేదని, విజ్ఞత లేకుండా మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు డిపాజిట్లు కూడా రావన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, నిరంజన్ వలీ, కటికం సత్తయ్య గౌడ్, ఫరీదుద్దీన్, బొర్ర సుధాకర్, బోయపల్లి కృష్ణారెడ్డి, జి.వెంకటేశ్వర్లు, అభిమన్యు శ్రీనివాస్, పబ్బు సందీప్, శ్రీనివాస్‌రెడ్డి, రూప పాల్గొన్నారు.