అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, కుల మతాల ఐక్యతను పెంచిన ఘనత ఆయనదేనని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆ నియోజకవర్గానికి చెందిన 45 మంది ముస్లింలకు లక్ష రూపాయల చెక్కులను మంత్రి అందజేశారు. అంతకు ముందు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ రూ.50 లక్షలతో 350 మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమైక్య పాలనలో మైనార్టీలను ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని, సీఎం కేసీఆర్ అన్ని మతాలకు సమ ప్రాధాన్యతనిచ్చి అండగా నిలుస్తున్నారన్నారు. స్వరాష్ట్రంలో వృత్తిదారుల జీవనోపాధి మెరుగుపడిందని, అందరి ఆత్మ గౌరవం పెంపు దిశగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని తెలిపారు. సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో
ఉన్నదని చెప్పారు.
సూర్యాపేట టౌన్, ఆగస్టు 27: అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడంతోపాటు మైనార్టీల సంక్షేమంలోనూ రాష్ట్రం యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. కుల, మతాల ఐక్యతను పెంచిన ఘనత ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. సూర్యాపేట నియోజక వర్గానికి చెందిన ముస్లిం మైనార్టీలు 45 మందికి 100 శాతం సబ్సిడీతో కూడిన ఒక్కొరిరి లక్ష రూపాయల చెక్కులను ఆదివారం సాయంత్రం మంత్రి క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాడు ఉమ్మడి పాలనలో మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుని కులమత పంచాయితీలను ప్రోత్సహించారు తప్ప, వారి అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. కానీ నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం కల్పించి అక్కున చేర్చుకుని అండగా నిలుస్తున్నామన్నారు.
మైనార్టీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించి ఆదుకుంటున్నారన్నారు. మైనార్టీలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి వారు విద్యలో పురోభివృద్ధి చెందడానికి ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. దేశంలో 40 శాతం ప్రజలు ఒక్కపూట మాత్రమే తింటూ పస్తులుంటున్నారని, కానీ తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు రెండు పూటలా ఆహారాన్ని తీసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారన్నారు. ఇప్పటివరకు సూర్యాపేట జిల్లాలో 138 మంది మైనార్టీలకు ఆర్థిక సాయం కింద లక్ష రూపాయల చెక్కులను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సూర్యాపేట జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, జడ్పీటీసీ జీడి భిక్షం, నాయకులు జూలకంటి జీవన్‌రెడ్డి, మర్ల చంద్రా రెడ్డి, అజీజ్, రియాజ్, మౌలానా, సయ్యద్, తాహేర్, సల్మామస్తాన్ పాల్గొన్నారు.