పదిహేను రోజులకోసారి నీటి సరఫరా.. కిలోమీటర్ల దూరం నుంచి బిందెల్లో నీళ్లు తెచ్చుకుంటున్న ప్రజలు.. ప్రైవేట్‌లో డబ్బులు వెచ్చించి ట్యాంకర్ నీళ్ల కొనుగోలు.. ఇదీ భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామంలో పరిస్థితి. ఎండకాలానికి ముందే నీటి తిప్పలు తప్పని దుస్థితి. అధికారులకు విన్నవించినా కనీసం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు గోడును వెల్ల బోసుకుంటున్నారు.
భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామంలో సుమారు 1,300 కుటుంబాలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎండ కాలంలోనూ ఇక్కడ ఎన్నడూ నీటి కష్టాలు లేవు. మిషన్ భగీరథతో ఇంటింటికీ నీళ్లు అందాయి. కానీ ప్రస్తుతం వేసవికి ముందే నీటి కష్టాలు మొదలయ్యాయి. సంక్రాంతి వరకు నీటి సరఫరా బాగానే ఉన్నా.. ఇప్పుడు 15 రోజులకోసారి గానీ రావడం లేదు. అదీ ఒక్కటి, రెండు రింగులకు మించి ఇవ్వడం లేదు. ఊళ్లో ఏ ఇంట్లో చూసినా ఖాళీ సంపులే కనిపిస్తున్నాయి. మి షన్ భగీరథ నిర్వహణ అస్తవ్యస్తంగా మారిం ది. మెయిన్ వాటర్ ట్యాంకు నిరుపయోగంగా మార్చారు. మినీ ట్యాంకులు సైతం నీళ్లు లేక ఎండిపోయాయి. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం రోజురోజుకూ సమస్య జఠిలమవుతున్నది.
పొలాల నుంచి..
ఇంట్లో నీళ్లు లేనిదే ఏ పనీ జరుగదు. గృహ అవసరాలను అటుంచితే తాగునీటికి కూడా దిక్కులేదు. దాంతో గ్రామానికి కిలో మీటర్ల దూరంలో ఉన్న పొలాల వద్దకు బిందెలు, క్యాన్లతో వెళ్లి ప్రజలు నీళ్లు తెచ్చుకుంటున్నారు. మహిళలు బావులు, బోర్ల దగ్గరికే వెళ్లి బట్టలు ఉతుకుతున్నారు. వృద్ధు లు సైతం నడుచుకుంటూ వెళ్లి నీళ్లు మోసుకొచ్చుకుంటున్నారు. భూగర్భజలాలు అడుగుంటుతున్న నేపథ్యంతో పంటలకు నీళ్లు సరిపోవడం లేదని రైతులు కూడా బోర్ల వద్దకు రావద్దంటున్నారని గ్రామస్తులు వా పోతున్నారు. దాంతో కొందరు వాటర్ ఫిల్ట ర్ వేస్టేజీ వాటర్‌ను తెచ్చుకొని వాడుకుంటున్నారు. చిన్న పిల్లలకు ఆ నీటితో స్నానం చేయిస్తే దురద వస్తున్నదని చెప్తున్నారు.
ప్రైవేట్ ట్యాంకర్లతో..
నీటి సరఫరా లేకపోవడంతో కొందరు గ్రామస్తులు ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. రెండు, మూడు కుటుంబాలు కలిసి ఒక ట్యాంకర్ తెప్పించుకుంటున్నాయి. ఇంట్లో ఉన్న సంపులను నింపుకొని నాలుగైదు రోజులు వాడుకుంటున్నాయి. ఒక్కో ట్యాంకర్ వెయ్యి రూపాయలు వెచ్చిస్తున్నారు. నీటి సమస్యపై స్థానిక అధికారులకు మొర పెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదని, నీళ్లు రాకపోతే మేమేం చేస్తామంటూ నిర్లక్ష్యంగా బదులిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు.
పొలాల దగ్గర తెచ్చుకుంటున్నం
మా ఊళ్లో 15 రోజులైనా నీళ్లు రావడం లేదు. నీళ్లు లేకపోతే రోజెట్ల గడిచేది? బోరు బావుల వద్దకు వెళ్లి బిందెలు, క్యాన్లతో తెచ్చుకుంటున్నం. ముసలోళ్లు కూడా కాలినడక మోసుకొస్తున్నరు. పదేండ్లలో ఇట్ల ఎప్పుడూ తెచ్చుకోలేదు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. బోర్లు పోతే మేమేం చేయాలంటున్నరు. కనీసం ట్యాంకర్లతోనైనా నీళ్లు ఇయ్యాలి.
– నల్ల నర్సింహ, వడపర్తి
మళ్లీ ఓట్లని వస్తే బిందెలతో కొడ్తం..
ఇంటి ముందు సాంపి చల్లడానికి గూడ నీళ్లు లేవు. లీడర్లు ఓట్లప్పుడు బానే వస్తరు. ఇప్పుడు ఎందుకొస్తలేరు? మళ్లీ ఓట్లని వస్తే బిందెలతో కొడ్తం. బాయికాడికి పోతే రైతులు అడ్డుకుంటున్నరు. ఎమ్మెల్యే, అధికారులు పట్టించుకోవాలి. మా సమస్యను పరిష్కరించాలి.
– కె.నిర్మల, గ్రుహిణి
బీఆర్ఎస్ టైమ్‌లో నీళ్లకు ఇబ్బంది లేదు
బీఆర్ఎస్ టైమ్‌లో నీళ్లకు ఇబ్బంది లేదు. ఇప్పుడు ఊళ్లో నీళ్లే వస్తలేవు. బాయిల కాడికి వెళ్లి బట్టలు ఉతుక్కుంటున్నాం. పొలాల రైతులేమో రావద్దని తిడుతున్నరు. చేసేది లేక ప్రైవేట్ ట్యాంకర్‌ను తెప్పించుకుంటున్నం. ఒక్కో ట్యాంకర్‌కు వెయ్యి రూపాయలు అవుతున్నాయి. ఇట్ల ఎన్ని రోజులు తెప్పించుకోవాలి?
– జూపల్లి లక్ష్మి, గృహిణి, వడపర్తి