నిడమనూరు, జనవరి 5 : మండల కేంద్రంలోని నల్లచౌట చెరువు నీటిని శిఖం ఆక్రమణదారులు అక్రమంగా దిగువకు విడుదల చేస్తున్నారు. శిఖం భూములను అడ్డూ అదుపు లేకుండా పదుల సంఖ్యలో ఆక్రమించి సాగు చేస్తున్న అక్రమార్కులు ఆ భూముల్లోని పంటల మునక సాకుతో అడ్డగోలుగా రెచ్చిపోతున్నారు. ఇటీవల కురిసిన తుఫాను ప్రభావంతో ఎగువన గొలుసు కట్టు చెరువుల నుంచి పెద్ద ఎత్తున నిడమనూరు చెరువులోకి నీరు చేరి పూర్తి స్థాయిలో నిండింది. ఈ కారణంగా శిఖంలో సాగు చేస్తున్న పంటలు నీట మునిగాయి. దీంతో ఆక్రమణ దారులు చెరువు తూము షట్టర్లు ఎత్తి గత పక్షం రోజులుగా చెరువు నీటిని అక్రమంగా దిగువకు వదులుతుండటంతో చెరువు కళా విహీనమవుతున్నది. చెరువులో నీరు ఖాళీ అయితే రానున్న వేసవిలో తీవ్ర ఇబ్బందులు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. చెరువు నీటిని అక్రమంగా విడుదల చేసిన తీరు, ఆక్రమణలపై గతంలో పలువురు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడు లేడు.
నిద్ర మత్తులో నీటిపారుదల శాఖ…
గతంలో శిఖం ఆక్రమణలపై నమస్తే తెలంగాణ కథనం నేపథ్యంలో ఉన్నతాధికారులు సర్వేకు ఆదేశించారు. ఆక్రమణదారులకు నోటీసులిచ్చిన రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు చెరువులో నీరుందన్న సాకును చూపి విచారణను తూతూ మంత్రంగా నిర్వహించి అటకెక్కించారు. 310 ఎకరాల చెరువు శిఖం భూముల్లో 100 ఎకరాల మేర కబ్జాకు గురైనట్లు స్థానికులు పేర్కొంటున్నారు. చెరువు వెంట శిఖం ఆక్రమణల నేపథ్యంలో తూము సమీపంలోకి వ్యవసాయ సాగు పంటలు రావడంతో చెరువు నిండిన తరుణంలో చెరువు నీరు వరదల రూపంలో ఇండ్లలోకి చేరుతున్న పరిస్థితి ఏటా చోటు చేసుకుంటున్నది. నివారణా చర్యలు చేపట్టాల్సిన నీటిపారుదల శాఖ చోద్యం చూస్తుండటంతో చెరువు రూపు రేఖలు మారుతున్నాయి.
ఫిర్యాదు చేసినా చర్యలు కరువు
నిడమనూరు, సోమోరి గూడెం, ముప్పారం చెరువు శిఖం ఆక్రమణలపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. ఆయకట్టు రైతులు, మత్స్యకార్మికులు చెరువుపై ఆధారపడుతున్నా శిఖం ఆక్రమణదారులు పంటల మునక పేరుతో అక్రమంగా నీటిని దిగువకు వదులుతున్నారు. దీనిపై అధికారులకు వివరించినా స్పందన లేదు. చెరువులో నీరు కొంత మేర ఖాళీ అయ్యింది. ఇలాగే ఉంటే రానున్న వేసవి లో తాగు, సాగు నీటి అవసరాలకు ఇబ్బందే.
-కోట్ల సైదులు, చైర్మన్ ముప్పారం, మత్స్యపారిశ్రామిక సహకార సంఘం