పెన్పహాడ్, మే 14 : సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల పరిధిలోని నారాయణగూడెం గ్రామ వీఓఏ అక్రమాలపై అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన కుర్రి ప్రమీల సంఘం సభ్యుల నుంచి వసూలు చేసిన డబ్బులు రూ.15.17 లక్షలను వారి ఖాతాలో జమ చేయకుండా తన సొంత అవసరాలకు వాడుకున్నట్లుగా ఆరోపణలు. దీనిపై గ్రామానికి చెందిన నక్క సందీప్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టినట్లు ఏపీఎం అజయ్ నాయక్ తెలిపారు.
గ్రామంలో ఉన్న 34 పొదుపు సంఘాల్లో 7 సంఘాల లావాదేవీలపై శ్రీనిధి మేనేజర్ జ్యోతి, సీసీలు పద్మావతి, శైలజ, స్వరూప గ్రామంలో విచారణ జరుపగా సభ్యుల నుంచి నెలవారీగా వసూళ్లు చేసిన రూ.5.50 లక్షల సొమ్మును పొదుపు సంఘాల సభ్యుల సంతకాలను ఫోర్జరీ దుర్వినియోగం చేసినట్లు, అదేవిధంగా వీఓఏ అక్రమంగా బ్యాంక్ రుణాలు తీసుకున్నట్లు ప్రాధమిక విచారణలో అధికారులు గుర్తించారు.