తెలంగాణ సంస్కృతి వైభవానికి ప్రతీక విజయ దశమి వేడుక. తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకల అనంతరం శనివారం ప్రజలు దసరా పండుగగా సంబురంగా జరుపుకొన్నారు. వివిధ ప్రాంతాల్లో ఉండే వారంతా పండుగకు తమ సొంతూళ్లకు రావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాలన్నీ సందడిగా కనిపించాయి. మరో వైపు పలు దేవాలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం శమీ వృక్షాన్ని పూజలు చేశారు. పట్టణాల్లో ప్రత్యేకంగా పాలపిట్ట దర్శనానికి ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యుల ఆత్మీయ ఆలింగనాలు, ఆశీర్వచనాలు, బంధుమిత్రుల అలయ్ బలయ్ అందరిలో ఆనందాలు నింపింది. పలుచోట్ల రావణాసుర వధ కార్యక్రమాలు నిర్వహించగా పెద్ద ఎత్తున జనం పాల్గొని పటాకులు కాల్చి, కేరింతలతో హోరెత్తించారు. వేడుకల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. సూర్యాపేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొన్నారు.