నూతనకల్, మే 15 : వేసవి తాపం నుంచి పశువులు, గేదెలు ఇతర జీవాలను రక్షించుకోవడంతో పాటు వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు రైతులు పశువైద్యాధికారుల సూచనలు పాటిస్తూ, జాగ్రత్తలు వహించాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పశువులకు చూడి పరీక్షలు చేయించి, లోపాలను గుర్తించి చర్యలు తీసుకోవాలి. గాలికుంటు, జబ్బవాపు, గురక, దౌంసులీరియూసిస్ వంటి స్థానికంగా కనిపించే అంటు వ్యాధుల నివారణకు టీకాలను వేయించాలి. గేదెలు, దూడలకు వెంట్రుకలు కత్తిరించి పేలు, పిడుదులు, గోమార్ల నివారణకు చర్యలు తీసుకోవాలి.
పశువుల పాక కొంచెం ఎత్తులో ఉండేలా, పచ్చని ఆకులతో వేసిన చల్లని పందిళ్లలో పశువులను కట్టేయాలి. పందిరిపై నీటితో తడుపుతూ, ప్రతి రోజూ సాయంత్రం చల్లటి నీటితో శుభ్రం చేస్తుండాలి. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మేత కోసం బయటకు తీసుకెళ్లక పోవడమే మంచిది. వైద్యుల సూచన మేరకు క్లోరైడ్ లవణాన్ని నీటిద్వారా ఇవ్వాలి.
విటమిన్ -ఏ పాడి పశువులకు ఉష్ణోగ్రత, ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. ఎండు గడ్డిని రాత్రి సమయంలో ఇవ్వాలి. పచ్చి మేత లభించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలి. రోజుకు 60 గ్రాముల లవణ మిశ్రమం ఇచ్చి పచ్చిమేత మేపాలి. అయోడిన్ కలిగిన ఉప్పును దాణాతో కలిపి ఇవ్వాలి. రోజుకు రెండు సార్లు చల్లని నీటితో స్నానం చేయించడంతో ఎండ తీవ్రత నుం చి గేదెలు ఉపశమనం పొందుతాయి. దీనివల్ల పాల దిగుబడి తగ్గకుండా కాపాడుకోవచ్చు .
పశువుల పాకలను సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం పాడి రైతులను ప్రోత్సహించేందుకు ఈజీఎస్ ద్వారా పశువుల పాకలు నిర్మిస్తున్నది. పశువులకు వడదెబ్బ తగులకుండా ఈ పథకాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
– రవికుమార్, మండల పశువైద్యాధికారి, నూతనకల్